అక్షరటుడే, వెబ్‌డెస్క్: Geo Spatial Technology India | తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలోని జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో నిర్వహించిన మూడు రోజుల కార్యశాల గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంత టెక్నాలజీస్ వైస్ ఛైర్మన్ మాచర్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ.. రానున్న కాలంలో భారత్‌లో జీఐఎస్ (GIS) రంగంలో దాదాపు పది లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు. ప్రస్తుతం జియో స్పెషల్ విభాగంలో కోటి పది లక్షలకుపైగా వ్యాపారం జరుగుతోందని వెల్లడించారు.
గతంలో జీఐఎస్‌ను ప్రధానంగా రక్షణ అవసరాలకే వినియోగించేవారని తెలిపారు. ప్రస్తుతం జీపీఎస్ లేకుండా ఏ రంగం కూడా నడవని పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రయాన్-1, చంద్రయాన్-2, మంగళయాన్ వంటి అంతరిక్ష ప్రయోగాల్లో అనంత టెక్నాలజీస్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
Geo Spatial Technology India | డిజిటల్ అగ్రికల్చర్ అభివృద్ధికి..
ఎన్‌ఆర్‌ఎస్‌సీ డిప్యూటీ డైరెక్టర్ రాఘవస్వామి మాట్లాడుతూ.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలలో డిజిటల్ అగ్రికల్చర్ అభివృద్ధికి జీఐఎస్ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం సైన్స్ డీన్ ఆచార్య సంపత్ మాట్లాడుతూ.. ఈ కార్యశాల విద్యార్థులు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.
Geo Spatial Technology India | ప్రత్యక్ష మ్యాపుల రూపకల్పన
ఎన్‌ఐఆర్‌డీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.వి. రవిబాబు.. విద్యార్థులకు జీపీఎస్ ద్వారా మ్యాపింగ్ చేసే విధానాన్ని వివరించారు. దోమకొండ లోని రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, పోర్టు ప్రాంతాల మ్యాపులను విద్యార్థుల చేత ప్రత్యక్షంగా రూపొందింపజేశారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సృజనాత్మకతను ప్రదర్శించాలని సూచించారు. జియో విద్యార్థులకు NIRDలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉంటాయన్నారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శివ ప్రతాప్ మాట్లాడుతూ.. ఇటువంటి వర్క్‌షాప్‌లు విద్యార్థులకు నిజ జీవిత అనుభవాన్ని అందిస్తాయని చెప్పారు. వర్క్‌షాప్ కన్వీనర్ డాక్టర్ టి. ప్రతిజ్ఞ తెలిపిన ప్రకారం.. ఐదు రాష్ట్రాల నుంచి సుమారు 70 మంది విద్యార్థులు కార్యశాలలో భాగస్వామ్యమయ్యారు.
ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, విభాగాధిపతి డాక్టర్ డి. సబిత, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యురాలు డాక్టర్ కవిత తురన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. నారాయణగుప్త, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

