అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త తరహా మోసాలతో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా వీరి బారీన పడుతుండటం గమనార్హం.
వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్‌కు సైబర్ నేరస్తులు (Cyber Criminals) టోకరా వేశారు. పెట్టుబడుల పేరిట నమ్మించి రూ. కోటి కాజేశారు. సుధాకర్ అనే వ్యక్తి గతంలో నిట్‌లో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆయన ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. దీంతో అందులో కనిపించిన ఓ లింక్‌ను క్లిక్ చేశాడు. అక్కడ తన వాట్సాప్ నంబర్ పంచుకున్నాడు.
Cyber Fraud | లాభాలు వస్తాయని నమ్మించి
సదరు మాజీ ఫ్రొపెసర్కు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని అందులో ఉంది. దీంతో ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. అనంతరం ఆయనను ‘H_18’ అనే వాట్సాప్ గ్రూప్‌లో సైబర్ నేరగాళ్లు చేర్చారు. తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం కంపెనీ అకౌంట్స్ మేనేజర్‌గా ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆయన చెప్పినట్లు సదరు మాజీ ప్రొఫెసర్ జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.1 కోటి వరకు ట్రాన్స్ఫర్ చేశాడు.
Cyber Fraud | పోలీసులకు ఫిర్యాదు
డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లాభాలు రాకపోవడం, తన డబ్బులు సైతం తిరిగి ఇవ్వకపోవడంతో సుధాకర్ మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు, వాట్సాప్ నంబర్ ఆధారంగా నిందితులను ట్రేస్ చేయడానికి యత్నిస్తున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పెట్టుబడుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బు బదిలీ చేయొద్దన్నారు.
ఇది కూడా చదవండి : Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు

