Cheddi Gang in Tirupathi | పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతిలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ (Raghunatha Resorts) ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈసారి దొంగతనం ప్రయత్నం విఫలమవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ సునంద కుమార్ రెడ్డి నివాసంలోకి ముగ్గురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి 2:20 గంటల సమయంలో చేరుకుంది. వారిలో ఒకరు మాత్రమే ఇంట్లోకి చొరబడగా, మిగిలిన ఇద్దరు బయట గమనిస్తూ నిలబడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగ దాదాపు గంటకు పైగా, అంటే 3:30 గంటల వరకు అక్కడే సంచరించాడు.
Cheddi Gang in Tirupathi | దొంగతనం చేయలేకపోయాడు..
అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మూడు బెడ్‌రూమ్‌లలో నిద్రిస్తున్నప్పటికీ, ఎలాంటి చోరీ జరగకముందే దొంగ అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యాడు. దొంగతనం ఎందుకు చేయలేకపోయాడనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడు సునంద కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో తిరుపతి రూరల్ పోలీసులు (Tirupati Rural Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్లను సేకరించి నిందితుల ఆనవాళ్ల కోసం శోధిస్తున్నారు.
ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ (Cheddy Gang) సంచారం నేపథ్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రిపూట గస్తీని పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతున్నారు. స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో తిరుపతిలో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కనుగొని వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Tirumala Vasanthotsavam | తిరుమలలో ఈ నెల 30 నుంచి వసంతోత్సవాలు

