అక్షరటుడే, వెబ్‌డెస్క్: BA.3.2 Variant | న్యూయార్క్ నగరంలో కొవిడ్ కొత్త వేరియంట్ స్థానికంగా ప్రజలను వణికిస్తోంది. కొత్తగా గుర్తించిన ఈ కొవిడ్-19 ఉప వేరియంట్ BA.3.2 పై శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు దృష్టి సారించారు. ఈ వేరియంట్‌లో దాదాపు 70–75 వరకు స్పైక్ ప్రొటీన్ మ్యూటేషన్లు ఉన్నట్లు ప్రాథమిక అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ కారణం వల్ల ఇది మనిషి శరీరంలోని రోగనిరోధక శక్తిని తట్టుకునే (immune escape) సామర్థ్యం కలిగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
BA.3.2 Variant | వేరియంట్ ప్రత్యేకత..
ఓమిక్రాన్ కుటుంబానికి చెందినదిగా BA.3.2 వేరియంట్‌ను గుర్తించారు. స్పైక్ ప్రొటీన్‌లో అధిక సంఖ్యలో మార్పులు ఉంటున్నాయి. దీనివల్ల ఈ వైరస్ మన శరీర కణాల్లోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఇప్పటికే టీకాలు తీసుకున్నవారితోపాటు గతంలో కొవిడ్ వైరస్ బారిన పడినవారిలో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.
BA.3.2 Variant | ఆరోగ్య అధికారుల స్పందన
ఈ వేరియంట్‌పై న్యూయార్క్ ఆరోగ్య శాఖ నిరంతర పరిశీలన కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేసులైతే పెద్దగా లేకున్నా.. జెనోమిక్ సర్వైలెన్స్ ద్వారా మరింత సమాచారాన్ని నిపుణులు సేకరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
టీకాలు ప్రభావం చూపుతాయా..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు కొత్త వేరియంట్ అయిన BA.3.2పై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. తీవ్రమైన అనారోగ్యాన్ని తగ్గించడంలో టీకాలు ఉపయోగపడొచ్చు.. కానీ సంక్రమణను పూర్తిగా అడ్డుకోకపోవచ్చని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుందా..
ఈ వేరియంట్ ను ఇప్పటివరకు న్యూయార్క్‌లో మాత్రమే గుర్తించారు. అయితే, అంతర్జాతీయ ప్రయాణాల వల్ల ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ఈ వేరియంట్‌పై నిశితంగా పరిశీలిస్తోంది.

