అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amaravati Capital Decision | ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) శాశ్వత రాజధాని అంశం మరోసారి కీలక మలుపు తిరిగింది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా అధికారికంగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎలాంటి వ్యతిరేకత లేకుండా అది ఆమోదం పొందింది.
ఈ చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రం కొనసాగడం బాధాకరమని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక స్థిరమైన రాజధాని అవసరమని స్పష్టం చేశారు.
Amaravati Capital Decision | అసలు సమస్య ఎక్కడ?
2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం హైదరాబాద్ ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని ఏదో స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ, అది చట్టబద్ధంగా నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది ఏమిటంటే .. చట్టంలో సవరణ చేసి “అమరావతి” పేరును అధికారికంగా చేర్చడం. అలా చేస్తే రాజధానికి పూర్తి చట్టబద్ధ హోదా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Amaravati Capital Decision | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చింది. అమరావతి (శాసన), విశాఖపట్నం (పరిపాలన), కర్నూలు (న్యాయ)గా అనుకున్నారు. అయితే రైతులు దీనిని కోర్టులో సవాలు చేయగా, 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక తీర్పు ఇచ్చింది. అమరావతిని అభివృద్ధి చేయాలని, దీనిపై ప్రభుత్వానికి బాధ్యత ఉందని, రాజధాని మార్పులో పార్లమెంట్ పాత్ర కీలకమని స్పష్టం చేసింది.
Amaravati Capital Decision | అమరావతి’ రాజధాని గా పార్లమెంట్ లో ఆమోదించే అవకాశం
ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం ఆమోదం పొందడంతో, తదుపరి దశగా దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్రం పార్లమెంట్‌లో చట్ట సవరణ చేస్తే, అమరావతి అధికారికంగా రాజధానిగా చట్టంలో నమోదవుతుంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ హోదా మరింత బలపడుతుంది.ఏప్రిల్ 1న ‘అమరావతి’ రాజధాని గా పార్లమెంట్ లో ఆమోదించే అవకాశం ఉందని అంటున్నారు. అలా జరిగితే భవిష్యత్తులో ప్రభుత్వం మారినా రాజధాని మార్పు అంత సులభం కాదు. మళ్లీ పార్లమెంట్ చట్ట సవరణ అవసరం అవుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీనిని “చట్టబద్ధ భరోసా”గా చూస్తోంది. ఇక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా అమరావతికి పూర్తిగా వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమని పేర్కొంటోంది. దీంతో ఈ అంశం పూర్తిగా ముగిసిందని చెప్పలేం. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు, కేంద్ర నిర్ణయాలు, కోర్టు తీర్పులు కలిసి ఈ విషయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్‌లో దాచి!
