అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kharg Island Tensions | ఇరాన్లో కీలకమైన ఖర్గ్ ద్వీపం స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. దానిని అమెరికా స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
పశ్చిమాసియలో ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్న విషయం తెలిసిందే. అమెరికా ఇప్పటికే ఓ సారి ఖర్గ్ ద్వీపంపై దాడులు చేసింది. దీనిని ఇరాన్ (Iran) తీవ్రంగా ఖండించింది. ప్రతీకారదాడులకు దిగింది. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. ఇరాన్ ప్రధాన ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపం వంటి కీలక మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకోవడంతో సహా, ఇరాన్‌లోని “చమురును తీసుకోవడమే తన ప్రాధాన్యత అన్నారు. ‘‘ఖార్గ్ ద్వీపాన్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మనం అక్కడ [ఖార్గ్ ద్వీపంలో] కొంతకాలం ఉండాల్సి వస్తుంది. వారికి ఎలాంటి రక్షణ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోగలం,” అని ట్రంప్ అన్నారు.
Kharg Island Tensions | హర్ముజ్ నుంచి అనుమతి
ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వాషింగ్టన్‌కు ‘బహుమతి’గా హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి అదనపు చమురు ట్యాంకర్లను వెళ్ళడానికి అనుమతించిందని తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. టెహ్రాన్ మొదట పాకిస్థాన్ జెండా ఉన్న 10 చమురు ట్యాంకర్లను ఈ కీలకమైన నౌకా మార్గాన్ని దాటడానికి అనుమతించిందని, ఆ తర్వాత ఆ సంఖ్యను 20కి పెంచిందని చెప్పారు.
Kharg Island Tensions | దాడులు చేస్తాం
తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి టెహ్రాన్‌కు గడువు సమీపిస్తోందని ట్రంప్ హెచ్చరించారు. ఏప్రిల్ 6 లోగా ఇరాన్ షరతులకు అంగీకరించాలని, లేకపోతే దాని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామన్నారు. అదే సమయంలో దౌత్య మార్గాలు చురుకుగా ఉన్నాయని చెప్పారు. పాకిస్థానీ మధ్యవర్తుల ద్వారా జరుగుతున్న పరోక్ష చర్చలు “చాలా బాగా సాగుతున్నాయి”, ఒప్పందం త్వరగా కుదిరే అవకాశం ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: North Korea | మరో ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. హై-థ్రస్ట్ మిస్సైల్ ఇంజిన్ పరీక్ష..
