అక్షరటుడే, వెబ్డెస్క్ : Hate Speech Bill | ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ నటులను ట్రోల్ చేస్తున్నారు. అలాగే కులాలు, మతాలను కించపరిచేలా కొందరు పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. ఈ మేరకు హేట్ స్పీచ్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ (Assembly)లో ప్రవేశ పెట్టారు.
సమాజంలో విద్వేష నివారణ కోసం బిల్లు ప్రవేశపెడుతున్నామని మంత్రి పొన్నం (Minister Ponnam) ప్రకటించారు. సోషల్ మీడియా వేదికలపై కులమతాలను నిందిస్తూ, మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగాలు, రాతల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు బిల్లును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధించేలా, బాధితులకు న్యాయం జరిగేలా బిల్లు రూపొందించామని తెలిపారు. నేరస్తులకు 1-7 ఏళ్లు జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.
Hate Speech Bill | రెండో రాష్ట్రంగా..
ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష నేరాల స్వభావాన్ని, వాటి రూపాలను సమగ్రంగా పరిష్కరించడం లేదని మంత్రి అన్నారు. ఈ బిల్లును గతంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం (Government of Karnataka) ప్రవేశ పెట్టింది. తెలంగాణ రెండో రాష్ట్రంగా నిలిచింది.
Hate Speech Bill | కఠిన చట్టం అవసరం
బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి (MLA Yashaswini Reddy) మాట్లాడారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అసభ్య ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా ఆమె ఖండించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులతో వారిని మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు, హేట్ స్పీచ్తో ప్రాణాలు పోతున్నాయని, దీనిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Hate Speech Bill | వ్యతిరేకించిన బీజేపీ
హేట్ స్పీచ్ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకించారు. చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలని, గొంతు నొక్కడానికి కాదన్నారు. ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. లేదా హౌస్ కమిటీ వేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..: KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
