అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mobile | నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అయితే ఫోన్ బాడీపై, ముఖ్యంగా కింది భాగంలో సూది కూడా దూరని పరిమాణంలో ఉండే చిన్నపాటి రంధ్రాలను మీరు గమనించే ఉంటారు.
చాలా మంది ఇవి కేవలం డిజైన్ అనుకుంటారు లేదా సిమ్ కార్డ్ తీసే రంధ్రం అని భ్రమపడుతుంటారు. కానీ, మీ ఫోన్ కాల్స్ స్పష్టంగా వినిపించడంలో ఈ చిన్న రంధ్రం ఒక కీలక పాత్ర పోషిస్తుంది. దీని అసలు పేరేమిటి? ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mobile | ఏమిటి ఆ రంధ్రం రహస్యం?
దీనిని సాంకేతిక భాషలో ‘నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్’ (Noise-canceling microphone) అని పిలుస్తారు. సాధారణంగా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు నోటి దగ్గర ఉండే ప్రధాన మైక్రోఫోన్ మన గొంతును రికార్డ్ చేస్తుంది.
అదే సమయంలో, ఈ చిన్న రంధ్రం మన చుట్టూ ఉన్న అనవసరపు శబ్దాలను (ట్రాఫిక్ సౌండ్స్, గాలి హోరు లేదా జనాల సందడి) గ్రహిస్తుంది. ఫోన్‌లోని టెక్నాలజీ ఈ రెండు శబ్దాలను విశ్లేషించి, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను వడకట్టేస్తుంది. ఫలితంగా అవతలి వ్యక్తికి మీ వాయిస్ ఎటువంటి ఆటంకం లేకుండా చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
Mobile | ఎందుకు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి?
ప్రస్తుత ఆధునిక ఫోన్లలో ఇలాంటి రంధ్రాలు రెండు లేదా మూడు ఉంటున్నాయి.
ఒకటి: మనం మాట్లాడే మాటలను గ్రహించడానికి.
రెండవది: చుట్టూ ఉన్న రోదనను తగ్గించడానికి (Noise Cancellation).
మూడవది: వీడియోలు తీసేటప్పుడు ఆ దిశలోని శబ్దాలను (Directional Audio) స్పష్టంగా రికార్డ్ చేయడానికి తోడ్పడతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
చాలా మంది తెలియక చేసే చిన్న పొరపాట్లు ఫోన్ మైక్రోఫోన్‌ను దెబ్బతీస్తాయి.
మొబైల్ కవర్లు: కొన్ని చౌకబారు మొబైల్ కవర్లు ఈ చిన్న రంధ్రాన్ని మూసివేస్తాయి. దీనివల్ల మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి అస్పష్టంగా, ఏదో బావిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తాయి.
సిమ్ ఎజెక్టర్ పిన్: ఇది చూడటానికి సిమ్ స్లాట్ రంధ్రంలాగే ఉండటంతో, చాలామంది పొరపాటున సిమ్ పిన్‌ను ఇందులో పెట్టి గుచ్చుతుంటారు. అలా చేయడం వల్ల లోపల ఉండే సెన్సిటివ్ మైక్రోఫోన్ పొర దెబ్బతింటుంది. ఆ తర్వాత ఫోన్‌లో నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ పని చేయదు.
ఇది కూడా చదవండి: Animal Sixth Sense | జంతువుల ‘సిక్త్స్ సెన్స్’.. ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగట్టగలవంటే!
