అక్షరటుడే, కామారెడ్డి: Orange Alert Rains | అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. తాజాగా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.
Orange Alert Rains | కురుస్తున్న వర్షం..
కామారెడ్డిలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. గంట నుంచి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కామారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. పలు కాలనీలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక నిజామాబాద్లోనూ భారీ వర్షం కురిసింది. పగలంతా భానుడి భగభగలతో అల్లాడిన ఇందూరు వాసులు.. అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.
Orange Alert Rains | ఈ జిల్లాల రైతులు జాగ్రత్త..
కాగా ఉభయ (నిజామాబాద్, కామారెడ్డి) జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. ఆ జిల్లాల్లో 41-61 కిలోమీటర్ల గరిష్ట ఉపరితల గాలి వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.
