అక్షరటుడే, వెబ్డెస్క్: Assam BJP Manifesto | అస్సాంలో అధికారం నిలుపుకోవడం కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఈ మేరకు తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) విడుదల చేశారు.
అస్సాంలో పదేళ్లుగా బీజేపీ (BJP) అధికారంలో ఉంది. 2016 నుంచి 2021 వరకు సర్బానంద సోనోవాల సీఎంగా వ్యవహరించగా.. 2021 ఎన్నికల్లో విజయంతో హిమంత్ బిస్వా శర్మ సీఎం అయ్యారు. తాజాగా మరోసారి అస్సాం పీఠాన్ని గెలుచుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. ఈ మేరకు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము మళ్లీ గెలిస్తే మహిళలకు ప్రతి నెలా రూ.3 వేలు ఇస్తామని ప్రకటించింది.
Assam BJP Manifesto | 31 హామీలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అస్సాం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో 31 హామీలను పొందుపరిచారు. అస్సాం ఆదివాసీ వర్గాల భూమి, వారసత్వం, గౌరవాన్ని పరిరక్షించడం మేనిఫెస్టోలోని ఒక ప్రధాన వాగ్దానం. అక్రమ నివాసులు ఆక్రమించుకున్నారని ఆరోపించబడిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని బీజేపీ తెలిపింది. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని, శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది.
Assam BJP Manifesto | రూ.5 లక్షల కోట్లు
అస్సాంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా ‘అసోం గతి శక్తి మాస్టర్ ప్లాన్’ మద్దతుతో రూ.5 లక్షల కోట్లు కేటాయిస్తామని బీజేపీ తెలిపింది. వరద రహితంగా మార్చేందుకు, రూ.18 వేల కోట్లకు పైగా పెట్టుబడితో ‘బధ్ ముక్త్ అస్సాం మిషన్’ (Flood-Free Assam Mission)ను ప్రారంభిస్తామని పేర్కొంది. ప్రతి జిల్లాలో వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు ఉండేలా చూస్తామని తెలిపింది. చేపల పెంపకందారులకు ఆర్థిక సహాయం అందించి, చేపలు పట్టని కాలంలో వారికి ఆదాయ మద్దతును కల్పిస్తామని వెల్లడించింది.
Assam BJP Manifesto | నేత కార్మికుల కోసం..
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Prime Minister Housing Scheme) కింద అస్సాంలో ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించినట్లు కాషాయ పార్టీ తెలిపింది. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందుబాటులో ఉండేలా అదనంగా మరో 15 లక్షల ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించింది. 10 లక్షల మంది సాంప్రదాయ నేత కార్మికుల కోసం పథకం ప్రవేశ పెడతామని తెలిపింది. స్థానిక యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు, అస్సాంలో పెట్టుబడులు పెట్టే కొత్త పరిశ్రమలకు ప్రతి ఉద్యోగికి రూ.10 వేల వేతన రాయితీని అందిస్తామని ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి
