అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ITR Forms | పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక వార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను నోటిఫై చేసింది.
చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే ITR ఫారాలు 1-4 మార్చి 30న నోటిఫై చేయగా, ITR ఫారాలు 2, 3, 5, 6, 7, అలాగే ITR-U (అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేయడానికి)లను మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో వ్యక్తులు, వ్యాపారాలు, ఇతర సంస్థలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి IT రిటర్న్‌లను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. వ్యక్తులకు, తమ ఖాతాలను ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేని వారికి ITR దాఖలు చేయడానికి జులై 31 వరకు గడువు ఉంది.
ITR Forms | ఏ ఫారం ఎవరికి వర్తిస్తుంది
ఐటీఆర్ –1 సహజ్ (ITR-1 Sahaj): ఈ ఫారం భారతీయ వ్యక్తులందరికి వర్తిస్తుంది. వీరి మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు ఉండాలి. అలాగే జీతాలు, రెండు గృహ ఆస్తులు, ఇతర వనరులు (వడ్డీ మొదలైనవి), సెక్షన్ 112A కింద రూ.1.25 లక్షల వరకు మూలధన లాభాలు, రూ.5000 వరకు వ్యవసాయ ఆదాయం కలిగి ఉన్నవారు దీనిని వినియోగించుకోవచ్చు. ఏదైనా కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నవారు, లిస్టింగ్ కాని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టినవారు, సెక్షన్ 194N కింద TDS మినహాయించబడిన వారు దీనికి అర్హులు కారు.
ITR Forms | ఐటీఆర్–2 ఫారం
వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చే లాభాలు, ఆదాయాలు లేని వ్యక్తులు మరియు HUFలకు, అలాగే ITR-4 మరియు ITR-1 ఫారాలు వర్తించని వారికి ఈ ఫారం సరిపోతుంది. వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చే లాభాలు, ఆదాయాలు కలిగిన వ్యక్తులు, HUFలకు ITR-3 సరిపోతుంది. వ్యక్తులు, HUFలు, కంపెనీలు, ITR-7 ఫారం దాఖలు చేసే వ్యక్తులు కాకుండా, మిగిలిన ఇతర సంస్థలు లేదా వ్యక్తులు ITR-5 ఈ ఫారాన్ని సమర్పించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 11 కింద మినహాయింపు కోరే కంపెనీలు కాకుండా, మిగిలిన ఇతర కంపెనీల కోసం ఐటీఆర్–6 ఫారం తీసుకొచ్చారు.
ITR-7: సెక్షన్లు 139(4A), 139(4B), 139(4C) లేదా 139(4D) కింద మాత్రమే రిటర్న్‌ను సమర్పించాల్సిన వ్యక్తులు (కంపెనీలతో సహా) ఈ ఫారాన్ని ఉపయోగించవచ్చు. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తేదీ నుంచి 48 నెలలలోపు, తమ ఆదాయ వివరాలను సవరించుకోవడానికి లేదా నష్టాలను తగ్గించుకోవడానికి ITR-U ఫారాన్ని ఉపయోగించవచ్చు.
దీనిని కూడా చదవండి: FIIs Stock Market Sale | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 1.22 లక్షల కోట్ల షేర్లు అమ్మేసిన ఎఫ్ఐఐలు
