అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Chicken Shops | తెలంగాణలో చికెన్ వ్యాపార రంగంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ (Telangana Chicken Shop Owners Association) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు ఏప్రిల్ 1 నుంచి బంద్ బాట పట్టాయి. పౌల్ట్రీ కంపెనీలతో నెలకొన్న మార్జిన్ వివాదం ఈ ఆందోళనకు కారణమైంది.
చికెన్ షాపుల యాజమాన్యాల ప్రకారం, పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న మార్జిన్‌ను రూ. 26 నుంచి రూ. 16కు తగ్గించాయని ఆరోపిస్తున్నారు. ఈ తగ్గింపుతో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని, వ్యాపారం నడపడం కష్టమవుతోందని అంటున్నారు. అదనంగా, కంపెనీలు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తూ చికెన్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయని ఆరోపిస్తున్నారు.
Telangana Chicken Shops | నిరవధిక బంద్ పిలుపు
తగ్గించిన మార్జిన్‌ను తిరిగి పెంచే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను నిరవధికంగా మూసివేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. తమ సమస్యలను అర్థం చేసుకుని వినియోగదారులు సహకరించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రధానంగా హైదరాబాద్ (Hyderabad) సహా పలు జిల్లాల్లో చికెన్ షాపులు మూసివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో స్నేహా పౌల్ట్రి (Sneha Poultry) అవుట్‌లెట్లు తెరిచి ఉండటంతో ఇతర వ్యాపారులు అక్కడ నిరసనలు చేపట్టారు. స్నేహ అవుట్‌లెట్లు కూడా బంద్ పాటించాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళనలు జరిగాయి.
Telangana Chicken Shops | ధరలు కూడా పెరిగే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చికెన్ షాపులు మూతపడటంతో రాబోయే రోజుల్లో చికెన్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా. చిన్న వ్యాపారులను ఆదుకోవాలని, కంపెనీలు తమ మొండివైఖరిని వీడాలని వ్యాపారులు కోరుతున్నారు. సమస్యను ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.మొత్తానికి, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ చేపట్టిన ఈ బంద్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య చర్చలు జరిగి సమస్య త్వరగా పరిష్కారం కావాలని వినియోగదారులు ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Gas Shortage Protest | గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన
