అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Car Sales Growth | భారత దేశంలో కోవిడ్ తర్వాత ఫోర్ వీలర్ సేల్స్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) తోడవడంతో గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సేల్స్ నమోదయ్యాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాహన తయారీ సంస్థల రికార్డు స్థాయి పని తీరుతో 2025 -26 ఆర్థిక సంవత్సరంలో 47 లక్షలకుపైగా కార్లు అమ్ముడయ్యాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 8 శాతం ఎక్కువ. 2024-25లో పరిశ్రమ పీవీ విక్రయాలు సుమారు 43.4 లక్షలుగా ఉన్నాయి.
India Car Sales Growth | నంబర్‌వన్ స్థానంలో మారుతి సుజుకీ..
యూనిట్ల అమ్మకాల పరంగా మారుతి సుజుకీ (Maruti Suzuki) నంబర్ వన్ స్థానంలో ఉంది. కంపెనీ 2025-26లో రికార్డు స్థాయిలో 24.22 లక్షల వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22.34 లక్షల కార్లు సేల్ అయ్యాయి. టాటా మోటార్స్ (Tata Motors) 15 శాతం వార్షిక వృద్ధితో 6.4 లక్షల వాహనాలను అమ్మింది. మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 20 శాతం వార్షిక వృద్ధితో 6,60,276 గా నమోదయ్యాయి.
India Car Sales Growth | జోరు కొనసాగేనా?
కేంద్ర ప్రభుత్వం (Central Government) గతేడాది ద్వితీయార్థంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చింది. జీఎస్టీ 2.0 లో పన్నులు తగ్గడంతో కార్ల ధరలు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణికుల వాహనాల విక్రయాలు పెరిగాయి. రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే నూతన ఆర్థిక సంవత్సరంలో ఈ జోరు కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ టారిఫ్‌లు, ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం కారణంగా ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు సరఫరా ఇబ్బందులు సమస్యగా మారాయి. దీంతో కంపెనీలు కార్ల ధరలను పెంచాయి. దీని ప్రభావం అమ్మకాలపై పడుతుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
