అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cockroach Facts | మన ఇళ్లలో, ముఖ్యంగా వంటగదిలోని చీకటి మూలల్లో కనిపించే బొద్దింకలను చూస్తే చాలా మందికి చిరాకు కలుగుతుంది. కానీ, ఈ చిన్న కీటకాల వెనుక కోట్లాది సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన జీవన పోరాటం దాగి ఉందని తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,500 జాతుల బొద్దింకలు ఉండగా, అందులో కేవలం 30 రకాలు మాత్రమే మన నివాసాల్లో కనిపిస్తాయి. వీటి మనుగడ సాగించే తీరు శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
Cockroach Facts | డైనోసార్ల కంటే పురాతనమైనవి:
బొద్దింకలు భూమిపై అత్యంత ప్రాచీనమైన జీవుల్లో ఒకటి. ఇవి సుమారు 35 కోట్ల సంవత్సరాల క్రితమే (కార్బోనిఫెరస్ కాలం) ఉనికిలో ఉన్నాయని శిలాజ ఆధారాలు చెబుతున్నాయి. అంటే మహాకాయాలైన డైనోసార్ల కంటే ముందే ఇవి భూమిపై సంచరించాయి.
కాలక్రమేణా వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా.. డైనోసార్ల వంటి జీవులు అంతరించిపోయినా.. బొద్దింకలు మాత్రం తమ రూపాన్ని పెద్దగా మార్చుకోకుండానే నేటికీ మనుగడ సాగిస్తున్నాయి.
Cockroach Facts | అద్భుతమైన శరీర నిర్మాణం:
బొద్దింక శరీరం తల, పొట్ట, మధ్య భాగం అనే మూడు భాగాలుగా ఉంటుంది. వీటి తలపై ఉండే రెండు యాంటెనాలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని పసిగట్టడానికి ఇంద్రియాలుగా పనిచేస్తాయి. వీటి శరీరం పైన ఉండే నలుపు లేదా గోధుమ రంగు పెంకు (ఎక్సోస్కెలిటన్) ‘కైటిన్’ అనే పదార్థంతో తయారవుతుంది. ఇది చాలా బలంగా ఉండి, శత్రువులు, పర్యావరణ ఒత్తిడి నుంచి వాటిని రక్షిస్తుంది.
తల లేకపోయినా వారం రోజులు జీవం:
బొద్దింకల గురించి అత్యంత వింతైన విషయం ఏమిటంటే.. వాటి తల తెగిపోయినా సుమారు వారం రోజుల పాటు జీవించగలవు. మానవులకు మెదడు ప్రధాన నియంత్రణ కేంద్రం అయితే, బొద్దింకల్లో నాడీ వ్యవస్థ (గ్యాంగ్లియన్లు) శరీరం అంతటా విస్తరించి ఉంటుంది. అందుకే తల లేకపోయినా శరీరంలోని ఇతర భాగాలు స్పందిస్తూనే ఉంటాయి. అయితే ఆహారం తీసుకోలేవు కాబట్టి వారం తర్వాత ఆకలితో చనిపోతాయి.
అణు వికిరణాన్ని తట్టుకోగలవా?
అణుబాంబు దాడి జరిగినా బొద్దింకలు బతుకుతాయని ప్రచారంలో ఉన్న మాట కొంతవరకు నిజమే. అవి అణుధార్మికత (Radiation) వల్ల కలిగే వేడికి చనిపోయినప్పటికీ, ఇతర జీవులతో పోలిస్తే రేడియేషన్‌ను తట్టుకునే శక్తి వీటికి 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటి జన్యుపరమైన అడాప్టబిలిటీయే ఇందుకు ప్రధాన కారణం.
రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి?
బొద్దింకలు నిశాచర జీవులు, అంటే ఇవి రాత్రిపూట మాత్రమే చురుగ్గా ఉంటాయి. పగటిపూట వెలుతురు లేని, తేమగా ఉండే ప్రదేశాల్లో దాక్కుంటాయి. వ్యర్థ ఆహారాన్ని తిని జీవించే ఇవి.. సుమారు 150 రోజుల నుంచి ఏడాది కాలం వరకు బతుకుతాయి.
ఇది కూడా చదవండి: Bike ride | మండుటెండలో బైక్ ప్రయాణమా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!
