అక్షరటుడే, వెబ్‌డెస్క్: Everest Insurance Scam | నేపాల్‌లోని ఎవరెస్ట్ శిఖర ప్రాంతంలో పర్వతారోహకుల ప్రాణాలతో ఆడుకుంటూ సాగుతున్న భారీ ఇన్సూరెన్స్ కుంభకోణం అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపర్చింది. ఈ భారీ మోసం విషయంలో నేపాల్ ప్రభుత్వం, పోలీసులు (CIB) జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
Everest Insurance Scam | తక్షణ వైద్య సాయం పేరుతో..
పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌కు ముందు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అంటే పర్వతం పైకి వెళ్లేటప్పుడు మధ్యలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణ వైద్య సాయం అందించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇలా చేస్తారు. అయితే, ఇక్కడే మోసానికి బీజం పడుతుంది..
Everest Insurance Scam | మోసం ఇలా…
పర్వతారోహకులు పైకి వెళ్తున్నప్పుడు వారికి ఆహారం కింది నుంచే పంపిస్తారు. అయితే, గైడ్‌లు పంపించే ఆహారంలో బేకింగ్ సోడా లేదా ఇతర పదార్థాలను కలిపి ట్రెక్కర్లకు అనారోగ్యం (కడుపు ఉబ్బరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు) కలిగేలా చేస్తారు. ఇవి పర్వత ప్రాంతాల్లో తరచూ ప్రబలే ‘ఆల్టిట్యూడ్ సిక్నెస్’ లక్షణాలను పోలి ఉంటాయి. దీంతో భయపడిన పర్యాటకులు అత్యవసర హెలికాప్టర్ సహాయాన్ని కోరుతారు.
ఫేక్ రెస్క్యూలు:
హెలికాప్టర్ ద్వారా ఖాట్మండులోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు పర్యాటకులను తరలిస్తారు. అక్కడ వారికి అవసరం లేకపోయినా పెద్ద మొత్తంలో వైద్య పరీక్షలు నిర్వహించి, భారీగా బిల్లులు వేస్తారు.
భారీ దోపిడీలో అందరి భాగస్వామ్యం..
ఈ మొత్తం ప్రక్రియలో హెలికాప్టర్ కంపెనీలు, ట్రెకింగ్ ఏజెన్సీలు, కొన్ని ఆసుపత్రులు ఒక ముఠాగా ఏర్పడి మోసానికి పాల్పడుతున్నాయని పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు ₹165 కోట్లు) మేర క్లెయిమ్‌ల రూపంలో దోచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
32 మందిపై కేసు నమోదు..
ఈ వ్యవహారంపై నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CIB) దర్యాప్తు చేపట్టింది. ఇప్పటి వరకు 32 మందిపై కేసులు నమోదు చేసింది. ఇప్పటికే ట్రెకింగ్ ఏజెంట్లతో సహా పలువురు ఆసుపత్రుల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. 2022 – 25 కాలంలో దాదాపు 300కు పైగా ఇటువంటి నకిలీ రెస్క్యూల ద్వారా ట్రెక్కర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. మోసానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించారు.
ఇది కూడా చదవండి: Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!
