అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి (MLA Madhavi)పై మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఆమె సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి ఈ మేరకు ఈసీ ఫిర్యాదు చేశారు.
జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం ఇప్పటికే పార్టీ తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడం గమనార్హం. లోకం నాగమాధవి నెల్లిమర్ల (Nellimarla) నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమెకు ‘మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్’ అనే సంస్థ ఉంది. దాని ద్వారా ఆమె ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో ఎన్నికల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్‌ను ఈసీ ఆదేశించింది.
Jana Sena MLA | ఉద్యోగుల ఖాతాల నుంచి..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగమాధవి తన సంస్థలోని ఉద్యోగుల ఖాతాలను నగదు మళ్లింపు కోసం వాడుకున్నట్లు మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు 300 మంది ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను వినియోగించుకున్నట్లు ఆరోపించారు. ఉద్యోగుల జీతాలతో పాటు అదనంగా రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఖాతాల్లో జమ చేశారని, దానిని తిరిగి ఆమె మనుషులు వసూలు చేసి ఎన్నికల కోసం ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేపై ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సైతం సీరియస్ కావడంతో ఆమె ఇరకాటంలో పడ్డారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
దీనిని కూడా చదవండి : Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్ విడుదల
