అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khanapur Municipal Election | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో కమలం పార్టీ కౌన్సిలర్ అంకం మౌనిక ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరిలో మున్సిపలు ఎన్నికలు (Municipal Elections) జరిగిన విషయం తెలిసిందే. అదేనెల 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. అయితే హంగ్ వచ్చిన కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి ఫిబ్రవరి 17న ఎన్నికలు నిర్వహించారు. అయితే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో మాత్రం మళ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక శనివారం పూర్తయింది. ఖానాపూర్‌లో సైతం ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ సభ్యులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (Vedma Bojju) ఆందోళనతో అధికారులు వాయిదా వేశారు.
Khanapur Municipal Election | వీడిన ఉత్కంఠ
అధికారులు ఆదివారం ఖానాపూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. పలుమార్లు వాయిదా పడిన ఎన్నిక ఎట్టకేలకు పూర్తి కావడంతో ఉత్కంఠ వీడింది. బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ఛైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా.. బీఆర్ఎస్కు చెందిన మహమ్మద్ షోయబ్ వైస్ ఛైర్మన్‌గా గెలిచారు.
బల్దియాలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. దీంతో ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ యత్నించింది. అయితే బీఆర్ఎస్, బీజేపీ కలిసి పదవులను పంచుకున్నాయి. బీజేపీ ఛైర్పర్సన్ పదవి తీసుకోగా.. వైస్ ఛైర్మన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను ఎన్నుకున్నారు. శనివారం రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందగా.. తాజాగా బీజేపీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : BRS Municipal Victory | క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్
