అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ravi Bishnoi | ఐపీఎల్ 2026 (Ipl 2026) సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అదృష్టం జోరులో దూసుకుపోతోంది. ముఖ్యంగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు.
తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ ఒంటరిగా గేమ్‌ను మలుపుతిప్పి హీరోగా నిలిచాడు. అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ 73 పరుగులతో క్రీజులో సెటిల్ అవుతూ మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పుతున్నట్లు కనిపించాడు.అయితే ఆ సమయంలో బంతిని అందుకున్న బిష్ణోయ్ తన గూగ్లీలతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. వరుసగా కీలక వికెట్లు తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను కుదేలు చేశాడు. మొత్తం 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అతను, ముఖ్యంగా సాయి సుదర్శన్ వికెట్ తీసి టర్నింగ్ పాయింట్‌గా నిలిచాడు.
Ravi Bishnoi | చివర్లో దేశ్‌పాండే చక్కటి బౌలింగ్
మ్యాచ్ చివరి ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులను కాపాడుకోవడం రాజస్థాన్ విజయానికి కీలకంగా మారింది. గుజరాత్ చివరి వరకు పోరాడినా, రాజస్థాన్ బౌలర్ల వ్యూహాల ముందు నిలవలేకపోయింది. మ్యాచ్ అనంతరం బిష్ణోయ్ (Ravi Bishnoi) మాట్లాడుతూ గత సీజన్ తనకు చాలా కఠినంగా గడిచిందని చెప్పాడు. “నా లెంగ్త్‌లో చిన్న తప్పు జరిగినా బ్యాటర్లు భారీ షాట్లు ఆడేవారు. అందుకే ఈసారి ఆఫ్ సీజన్‌లో ఫిట్‌నెస్, లెంగ్త్‌పై ప్రత్యేకంగా వర్క్ చేశాను. డొమెస్టిక్ క్రికెట్ ద్వారా నా తప్పులను సరిదిద్దుకున్నాను. ఈరోజు నా వైవిధ్యమైన బౌలింగ్ వల్లే వికెట్లు దక్కాయి” అని వెల్లడించాడు.
గత రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన బిష్ణోయ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 2024లో 14 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు, 2025లో 11 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు మాత్రమే తీసి విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో లక్నో జట్టు అతన్ని వదిలేసింది. అయితే 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) అతనిపై నమ్మకం ఉంచి రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ నమ్మకాన్ని బిష్ణోయ్ మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. జట్టులో బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తుండటంతో ఈ సీజన్‌లో ఫైనల్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Shreyas Iyer | గెలిచిన సంతోషం లేదు.. స్లో ఓవర్ రేటుతో శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా
