అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ayushman Vay Vandana Card | 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఆయుష్మాన్ వయ వందన కార్డ్ ద్వారా ఏటా రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆదాయంతో సంబంధం లేకుండా దీనికి అందరూ అర్హులే కావడం గమనార్హం. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం (పీఎంజేఏవై)లో భాగంగా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పౌరుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఆరోగ్య భద్రతా రక్షణ కవచం ఇది. ఆయుష్మాన్ వయ వందన కార్డ్ గురించి తెలుసుకుందామా..
Ayushman Vay Vandana Card | అందరి కోసం..
వయసు పెరుగుతున్నా కొద్దీ అనారోగ్య సమస్యలు వస్తుండడం సహజం. ముఖ్యంగా స్థిర ఆదాయం లేని వృద్ధులకు ఈ సమస్యలు ఆర్థికంగా పెద్ద భారంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులను ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకమే ‘ఆయుష్మాన్ వయ వందన’. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం (పీఎంజేఏవై)లో భాగంగా దీనిని తీసుకువచ్చారు. ఇది 70 ఏళ్ల వయసు పైబడిన వారి ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందిన ప్రత్యేకమైన పథకం. ఆదాయంతో సంబంధం లేకుండా అందరూ దీనికి అర్హులే.. ధనవంతుడైనా, నిరుపేద అయినా ఈ పథకంలో చేరవచ్చు.
వయసు ప్రాతిపదికన అర్హులైన సీనియర్ సిటిజన్లందరూ ప్రభుత్వంతోపాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రులలో రూ. 5 లక్షల వరకు నగదు రహిత చికిత్సలు పొందవచ్చు. సాధారణ వ్యాధుతోపాటు ఇందులో క్లిష్టమైన శస్త్రచికిత్సలు, పలు వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు, ఆస్పత్రిలో చేరడానికి ముందు, తర్వాత అయ్యే చికిత్స ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది.
Ayushman Vay Vandana Card | బెనిఫిట్స్..
- ఇది వృద్ధులకు భరోసా ఇస్తుంది. వైద్య అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు, సరైన సమయంలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
- 70 ఏళ్లు పైబడినవారి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు.
- కేటరాక్ట్ సర్జరీ, హిప్ రీప్లేస్‌మెంట్, స్ట్రోక్‌తోపాటు చాలా రకాల వైద్య చికిత్సలు ఇందులో కవర్ అవుతాయి.
- కార్డు జారీ అయిన మొదటి రోజునుంచే కవరేజీ పరిధిలోకి వస్తారు.
Ayushman Vay Vandana Card | ఎలా పొందాలంటే..
- ఆన్‌లైన్ ద్వారా కానీ ఎంప్యానెల్డ్ హాస్పిటల్‌లో కానీ, కామన్ సర్వీస్ సెంటర్స్‌లోకానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ ఈ కార్డు పొందడానికి ఆధార్ కార్డ్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే సరిపోతాయి.
- ముందుగా ఆయుష్మాన్ యాప్‌నుగాని, https://beneficiary.nha.gov.in/ వెబ్‌సైట్‌ను గాని సంప్రదించాలి.
- లాగిన్ యాజ్ ఏ బెనిఫిషియరీ ని సెలెక్ట్ చేసుకుని ఫోన్ నంబర్, అనంతరం ఓటీపీ ఎంటర్ చేయాలి.
- పీఎంజేవై స్కీమ్‌ను, ఆయుష్మాన్ వయ వందన సబ్ స్కీమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేయాలి. ప్రక్రియ పూర్తయ్యాక కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- 1800 110 770 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చే వారు కాల్ బ్యాక్ చేసి రిజిస్ట్రేషన్‌లో సహాయం చేస్తారు.
ఇది కూడా చదవండి..: US Military Aircraft Crash | అమెరికా సైనిక రవాణా విమానం కూల్చివేత.. ఐదుగురు మృతి!
