అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Basara temple development | రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే సమక్క సారక్క గద్దెలను పునర్నిర్మించింది. మరోవైపు వేములవాడ రాజన్న (Vemulavada Rajanna) ఆలయ అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇటీవల భద్రాచలం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. తాజాగా బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
బాసర ఆలయంలో 9 అంతస్తులతో రాజగోపురం నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆలయ నమూనాను విడుదల చేసింది. సరస్వతి ఆలయ (Saraswati Temple) పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. జ్ఞాన సరస్వతి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వసంత పంచమి, ఇతర పర్వ దినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం.. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం భావించింది.
Basara temple development | శృంగేరి పీఠాధిపతుల అనుమతితో
బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు.
Basara temple development | అన్ని వసతులు..
ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. ఆరు వేల మంది భక్తులకు అన్ని వసతులతో 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఆలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, అవతలి వైపున సోలార్ రూప్‌టాప్‌తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి : Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్ నాయక్ వ్యూహం.. కాంగ్రెస్‌కు దూరమైన ఖానాపూర్ పీఠం..
