అక్షరటుడే, వెబ్డెస్క్ : Flood Water Management | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వరదల నియంత్రణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపట్టింది. వర్షాకాలం వచ్చిందంటే అనేక కాలనీలు జలమయం అవుతాయి. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి హైడ్రా చెరువులను పునరుద్ధరిస్తోంది. నాలాలపై ఆక్రమణలను తొలగిస్తోంది.
వరద నీరు చెరువులకు చేరేలా హైడ్రా ఏర్పాట్లు చేస్తోంది. ఇన్‌లెట్లలోకి ఫీడర్ ఛానళ్ల ద్వారా వరద నీరు వచ్చేలా వాటిని అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో మాదాపూర్ (Madhapur)లోని సున్నం చెరువుతో పాటు తమ్మిడికుంట పరిసరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath), సీఎంసీ కమిషనర్ సృజన సోమవారం పరిశీలించారు. గత రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ ఈ చెరువులను రెండోసారి పరిశీలించడం గమనార్హం. సున్నం చెరువు పక్కన ఉన్న బోరబండ బస్తీ, ఎన్ఆర్ఆర్ పురం నుంచి వచ్చే వరద నీరు ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి కలిసేలా తీసుకోవాల్సిన చర్యలను ఆయన సమీక్షించారు.
Flood Water Management | మురుగు నీరు మళ్లింపు
మురుగు నీరు చెరువుల్లోకి వెళ్లకుండా మళ్లించాలని రంగనాథ్ ఆదేశించారు. పైపులద్వారా కిందకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మాదాపూర్ – బోరబండ మీదుగా హైటెన్షన్ వైర్ల కింద నుంచి వెళ్లే రోడ్డు విస్తరణ అంశాన్ని కూడా పరిశీలించారు. చెరువులు నిండినప్పుడు ఔట్‌లెట్ల ద్వారా విడుదల చేసిన నీరు వెళ్లేందుకు ఉద్దేశించిన కాలువల విస్తరణపై చర్చించారు.
Flood Water Management | తమ్మిడికుంటలో..
భారీ వర్షం పడితే కొండాపూర్, ఐటీ హబ్ నుంచి వచ్చే వరదతో శిల్పారామం, మెటల్ చార్మినార్ పరిసరాలు జలమయం అవుతాయి. ఈ నీరు తమ్మిడికుంటకు చేరేలా అధికారులు ఇన్లెట్లను ఏర్పాటు చేశారు. వరద ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి చేరేలా కాలువల అనుసంధానం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఆయా చెరువుల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు.
ఇది కూడా చదవండి : Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు
