అక్షరటుడే, బాన్సువాడ: Wrestling Competitions | బీర్కూర్(Birkur) మండలం దామరంచ గ్రామంలో హనుమాన్ జయంతి (hanuman jayanti event) సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఏడాది నిర్వహించే ఈ పోటీలు ఈసారి మరింత ఉత్సాహభరితంగా సాగాయి.
Wrestling Competitions | వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు..
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు (Wrestlers) తమ ప్రతిభను ప్రదర్శిస్తూ హోరాహోరీగా పోటీ పడ్డారు. ఒక్కో పోటీ ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా మహిళా మల్లయోధురాలు పాల్గొని తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించడం ఈ పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు. యువత కేరింతలు, హర్షధ్వానాలతో సందడి నెలకొంది. పోటీల ముగింపులో విజేతలకు గ్రామ సర్పంచ్ బోయిని శంకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో శారీరక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, స్థానిక నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

