అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SRH Umpiring Controversy | ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు మైదానంలోనే కాకుండా బయట కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఒక విజయం, రెండు ఓటములతో నిలిచినా, ఆ మ్యాచ్‌లలో చోటుచేసుకున్న అంపైరింగ్ వివాదాలు జట్టును తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో తీసుకున్న నిర్ణయాలు తమకు నష్టం కలిగించాయని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారికంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
SRH Umpiring Controversy | క్లాసెన్ అవుట్‌పై పెద్ద వివాదం
సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగిన పోరులో హెన్రిచ్ క్లాసెన్ అవుట్ తీరు తీవ్ర చర్చకు దారితీసింది. ఫీల్డర్ ఫిలిప్ సాల్ట్ బౌండరీ వద్ద పట్టుకున్న క్యాచ్ సమయంలో అతని పాదం కుషన్‌ను తాకినట్లు రీప్లేలో కనిపించినా, థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని అభిమానులు తీవ్రంగా విమర్శించారు.రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరగగా, ఆ పోరులో మరో వివాదం తలెత్తింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఇచ్చిన క్యాచ్‌ను వరుణ్ చక్రవర్తి అందుకున్న తీరు అనుమానాస్పదంగా మారింది. బంతి నేలకు తగిలిందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయంపై మైదానంలో అసహనం వ్యక్తం చేసినందుకు అభిషేక్ శర్మకు జరిమానా విధించబడింది. మ్యాచ్ గెలిచినా, అంపైర్ల తీర్పులపై జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
SRH Umpiring Controversy | క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ‘అన్‌ఫెయిర్ ప్లే’
మూడో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో జరిగిన పోరులో మరింత విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చివరి ఓవర్లో బ్యాటర్ కొట్టిన బంతి బౌండరీ దాటకముందే డగౌట్‌లో ఉన్న ఆవేశ్ ఖాన్ బయట నుంచి తాకినట్లు రిపోర్టులు వచ్చాయి. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ‘అన్‌ఫెయిర్ ప్లే’ కిందికి వస్తుంది. ఈ పరిస్థితిలో సన్‌రైజర్స్‌కు ఐదు పరుగులు పెనాల్టీగా ఇవ్వాల్సి ఉండగా, అంపైర్లు ఈ అంశాన్ని గమనించకపోవడం మరింత వివాదానికి దారితీసింది. ఈ వరుస సంఘటనలతో అసహనం చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం త్వరలోనే బీసీసీఐ (BCCI)కి అధికారిక లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంపైరింగ్ ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలని, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Amy Jones Pippa Cleary Marriage | ఎల్లలు దాటిన ప్రేమ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రేమ పెళ్లి
