అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nagpur Explosives Seizure | మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్‌పూర్‌లో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంట్లో జెలటిన్ స్టిక్స్, 58 డిటోనేటర్లు, అనేక కనెక్టర్లు, 15 లైవ్ కాట్రిడ్జ్‌లతో సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపింది.
నాగ్‌పూర్ (Nagpur)లోని సీఏ రోడ్డులోని దోసర్ భవన్ చౌక్‌లో ఉన్న ఒక ఇంటి చిన్న తోటలో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు (Bomb Disposal Squads), ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని వెంటనే దిగ్బంధించి, అదనపు పేలుడు పరికరాలు ఏమైనా ఉన్నాయేమోనని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో నాగ్‌పూర్‌లో భయాందోళనలు చెలరేగాయి. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు.
Nagpur Explosives Seizure | పోలీసుల దర్యాప్తు
అత్యంత భద్రత, సున్నితమైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి (RSS Headquarters) సమీపంలో ఈ పేలుడు పదార్థాలు లభించడంతో పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పేలుడు పదార్థాలను గత ఒకటిన్నర నెలలుగా అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది. సంచిలో ఉంచిన జిలాటిన్ స్టిక్స్ కనిపించడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పేలుడు పదార్థాలన్నింటినీ సురక్షితంగా స్వాధీనం చేసుకుని, రహస్య ప్రదేశానికి తరలించారు. అయితే వాటిని ఎవరు అక్కడ పెట్టారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్ డ్రోన్లు
