అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Gains | హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని పూర్తిగా తెరవడం కోసం ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. పశ్చిమాసియాలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో దేశీయ స్టాక్ మార్కెట్ మొదట్లో నష్టాల బాటలో పయనించింది.
అమెరికా, ఇరాన్‌ల సంఘర్షణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తన విధాన నిర్ణయంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చనే అంచనాల మధ్య ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్, ఆటో మరియు కన్స్యూమర్ స్టాక్స్ వంటి రేటు సున్నితమైన రంగాలు నష్టాల బాటలో పయనించాయి. అయితే మూడో త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావొచ్చన్న అంచనాలతో ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు పరుగులు తీశాయి.
Stock Market Gains | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైనా..
వరుసగా మూడో సెషన్‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 452 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా 1,404 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 119 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 434 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 509 పాయింట్ల లాభంతో 74,616 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 23,123 వద్ద స్థిరపడ్డాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత వరుసగా నాలుగు సెషన్లపాటు మన మార్కెట్లు లాభాలతో ముగియడం ఇదే మొదటిసారి.
Stock Market Gains | కన్జూమర్ డ్యూరెబుల్స్ మినహా..
దేశీయ స్టాక్ మార్కెట్‌లో కన్జూమర్ డ్యూరెబుల్స్ మినహా అన్ని ప్రధాన ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ (Nifty)లో ఐటీ ఇండెక్స్ 2.50 శాతం, రియాలిటీ 1.67 శాతం, మెటల్ 1.55 శాతం, మీడియా 0.80 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.65 శాతం పెరిగాయి. కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.18 శాతం నష్టపోయింది.
Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,671 కంపెనీలు లాభపడగా 1,555 స్టాక్స్ నష్టపోయాయి. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 70 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 45 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.77 శాతం, టీసీఎస్ 2.68 శాతం, ఇన్ఫోసిస్ 2.60 శాతం, ఎయిర్‌టెల్ 2.13 శాతం, సన్‌ఫర్మా 1.67 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇండిగో 0.87 శాతం, అదానిపోర్ట్స్ 0.52 శాతం, ఎంఅండ్ఎం 0.50 శాతం, టైటాన్ 0.31 శాతం, ట్రెంట్ 0.27 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: April 07 Gold Rates | బంగారం ధర పెరుగుదలకు బ్రేక్.. నేటి రేట్స్ ఎంతంట
