అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amit Shah Statement | అస్సాం (Assam)లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 9న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం చివరి రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అస్సాంలోని బరాక్ లోయలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్రమ చొరబాట్ల నియంత్రణకు చర్యలు చేపడుతామన్నారు.
కాంగ్రెస్ అక్రమ చొరబాటుదారులకు ప్రవేశం కల్పిస్తోందని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ధర్మసత్రం కాదని, ఇక్కడ చొరబాటుదారులకు స్థానం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఎవరిని నాలుగు వివాహాలు చేసుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే ట్రిపుల్ తలాక్‌ను నిషేధించామని చెప్పారు. నాలుగు వివాహాలను నిషేధించిన తర్వాత, జనాభా మార్పును కూడా అరికడతామని తెలిపారు.
Amit Shah Statement | గిరిజనులకు మినహాయింపు
అస్సాంలో బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువస్తామని అమిత్ షా అన్నారు. గిరిజనులను దీని పరిధి నుంచి మినహాయిస్తామని హామీ ఇచ్చారు. అందులో ఎవరిని చేర్చాలో తమకు తెలుసని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ (Love Jihad)లను నిషేధించే చట్టాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్లో సైతం చొరబాటుదారులను తిరిగి వారి దేశాలకు వెళ్లగొడతామన్నారు.
Amit Shah Statement | హ్యాట్రిక్ కొట్టాలని..
అస్సాంలో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. 2016 నుంచి అక్కడ కమలం పార్టీ అధికారంలో ఉంది. 2016–21 వరకు సోనోవాలా సీఎంగా ఉండగా.. 2021 నుంచి హిమంత బిస్వా శర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జోరుగా ప్రచారం చేసింది. మంగళవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగియడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి : Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్ డ్రోన్లు
