అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Dharpalli Area Hospital | ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి (Dharpalli Area Hospital ) నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.
Dharpalli Area Hospital | ధర్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్..
మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ౩౦ పడకల స్థాయి నుంచి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆస్పత్రిగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిందని కలెక్టర్ తెలిపారు. రూ. 33.15 కోట్లతో అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం చేపట్టిందన్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, ఇంకా చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా కొనసాగుతుండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులను వేగంగా జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని గడువు విధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయితే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు.
Dharpalli Area Hospital | నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వద్దు..
భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆస్పత్రికి (Government Hospital Works) అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో కూడుకుని ఉన్నందున ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పవద్దని, టీజీఎండీసీ (TGMDC) ద్వారా అనుమతులు తీసుకుని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలోనే ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో ఇసుక వాహనాలు తిరుగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుంచి ఏరియా ఆస్పత్రి వరకు అప్రోచ్ రోడ్డును సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహశీల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఏఈ ప్రవీణ్ తదితరులున్నారు.

ఇది కూడా చదవండి: Congress Office Dispute | కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గొడవ.. ‘కేక్’ కోసం వాగ్వాదం
