అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA Demolition | రోడ్డుకు అడ్డంగా చేపట్టిన నిర్మాణాన్ని హైడ్రా (Hydraa) కూల్చి వేసింది. సికింద్రాబాద్, బన్సీలాల్‌పేట విలేజ్‌లోని న్యూ బోయిగూడలో 20 అడుగుల రహదారికి అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని బుధవారం కూల్చి వేసింది.
బోయిగూడలో సిమెంట్ రోడ్డు (Cement Road) వేసి రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోకుండా.. ఓ వ్యక్తి 20 అడుగుల రహదారిని 10 అడుగుల మేర 50 గజాల వరకూ ఆక్రమించాడు. కిందన షాపు, పైన నివాసం ఉండేలా నిర్మాణాన్ని చేపట్టాడు. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో రోడ్డుపై చిన్న డబ్బా పెట్టుకొని జీవించేవాడని, ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును పది అడుగుల మేర ఆక్రమించడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో హైడ్రా సిబ్బంది బుధవారం జేసీబీ (JCB)లతో వెళ్లి రోడ్డుపై నిర్మించిన భవనాన్ని తొలగించారు.
HYDRAA Demolition | బంజారాలేక్‌ను పరిశీలించిన కమిషనర్
ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) రంగనాథ్ క్షేత్రస్థాయిలో బుధవారం పర్యటించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని తాజ్ బంజారా లేక్‌ను పరిశీలించారు. శంషాబాద్ మండలం మామిడిపల్లిలోని చెరువులు, వరద కాలువల ఆక్రమణలను పరిశీలించారు. బంజారా లేక్ ఆక్రమణలకు గురవ్వడంతో పాటు కలుషితమై దుర్గంధభరితంగా మారిందని ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువులో ఆక్రమణలను తొలగించి పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. నాలాలను మూసివేసి వరద ముప్పునకు కారణమయ్యే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Flood Water Management | వరద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్
