అక్షరటుడే, వెబ్డెస్క్ : BRS Plenary Plan | భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక దశకు చేరుకుంది. 2001 ఏప్రిల్‌లో ఆవిర్భవించిన ఈ పార్టీ ఉద్యమ దశ నుంచి అధికారంలోకి వచ్చి, ప్రస్తుతం ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 26వ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గతేడాది వరంగల్ (Warangal)లో రజతోత్సవాలను అట్టహాసంగా నిర్వహించిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగ సభల రూపంలో కాకుండా, కేవలం ప్రతినిధుల సభగా ప్లీనరీని నిర్వహించాలని భావిస్తున్నారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.
BRS Plenary Plan | కొత్త కమిటీలపై దృష్టి
పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి (Party Foundation Day) ముందే జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కమిటీలపై కసరత్తు పూర్తి అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను పక్కన పెట్టి, ప్రధానంగా జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతోనే ప్లీనరీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ఈ నెల 25న తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్న ఆమె, పార్టీ ప్రకటన సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది.
BRS Plenary Plan | కొత్త కమిటీల నియామకం
ఆమె వ్యాఖ్యలకు వెంటనే స్పందిస్తే అనవసర ప్రచారం కలిగే అవకాశం ఉందని, స్పందించకపోతే ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి హడావుడి లేకుండా ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పార్టీ పునర్‌వ్యవస్థీకరణ, కొత్త కమిటీల నియామకం కీలకంగా మారింది. ప్లీనరీని ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
