అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. కేరళ (Kerala), అస్సాం (Assam), పుదుచ్చేరిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగింది. సాయంత్రం 6 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 84.42 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2021 ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్‌ను అధిగమించింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఇక్కడ గెలుపు కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించాయి. ఓటర్ల తీర్పు ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం అయింది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. త్రిపురలోని ధర్మానగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ 79.84 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Assembly Elections Polling | కేరళలో..
కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత సైతం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 75శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. కొన్ని సీట్లు గెలుచుకొని సత్తా చాటాలని బీజేపీ భావించింది.
Assembly Elections Polling | పుదుచ్చేరిలో రికార్డు
పుదుచ్చేరిలో 86 శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదు అయింది. సాయంత్రం 5 గంటల సమయానికి కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 86.92 శాతం ఓటింగ్ జరిగింది. 1977 నుంచి ఇక్కడ అత్యధిక ఓటింగ్ శాతం 2006లో 86 శాతంగా నమోదైంది. తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయింది. కాగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82.2 శాతం ఓట్లు పోలయ్యాయి.
దీనిని కూడా చదవండి : Bengal Elections | బెంగాల్ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ
