అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mukul Chaudhary Innings | ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఒక కొత్త సంచలనం వెలుగులోకి వచ్చింది. యువ బ్యాటర్ ముకుల్ చౌదరి (Mukul Chaudhary) తన అద్భుత ప్రదర్శనతో ఒక్క మ్యాచ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు ఒక దశలో కష్టాల్లో పడింది. అయితే ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో లక్నో విజయతీరాలకు చేరుకుంది.
Mukul Chaudhary Innings | యజమాని ప్రశంసలు
మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మైదానం (Sanjeev Goenka Stadium)లోకి వచ్చి ముకుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తండ్రిలా అతని భుజంపై చేయి వేసి మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే మ్యాచ్ అనంతరం ముకుల్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. “నా కొడుకు క్రికెటర్ అవ్వాలని మా నాన్న కల కనేవారు. నేను చిన్న వయసులోనే ఆట ప్రారంభించాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా, నాన్న ప్రోత్సాహంతో ముందుకు వచ్చాను” అని తెలిపాడు. తన స్వస్థలం రాజస్థాన్‌లోని ఝున్‌ఝునులో సరైన శిక్షణ సదుపాయాలు లేకపోవడంతో, జైపూర్‌కు వెళ్లి అభ్యాసం కొనసాగించానని చెప్పాడు. తర్వాత తన ఆటను మెరుగుపరుచుకోవడానికి గురుగ్రామ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని వెల్లడించాడు.
Mukul Chaudhary Innings | క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలనని నమ్మకం
ముఖ్యమైన సందర్భాల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని అడగగా, ముకుల్ ఆసక్తికరంగా స్పందించాడు. ఒత్తిడి ప్రతి మ్యాచ్‌లో ఉంటుంది. కానీ నేను దాన్ని భయంగా కాకుండా అవకాశంగా చూస్తాను. చివరి వరకు క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలనని నమ్మకం ఉంది అని అన్నాడు. ఒక్క బంతి నా పరిధిలోకి వస్తే చాలు, దాన్ని సిక్సర్‌గా మార్చగలననే నమ్మకం నాకు ఉంది. చిన్నప్పటి నుంచే నేను బలంగా కొట్టే ఆటను అలవాటు చేసుకున్నాను అని తన ఆట శైలిని వివరించాడు. ముకుల్ చౌదరి అద్భుత ఇన్నింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ యువ ఆటగాడు భవిష్యత్తులో మరిన్ని అద్భుత ప్రదర్శనలు చేస్తాడనే ఆశలు అభిమానుల్లో పెరిగాయి.
ఇది కూడా చదవండి..: David Warner Arrest | ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్..
