అక్షరటుడే, వెబ్‌డెస్క్: Damodar Rajanarsimha | ఆరోగ్యంగా ఉండడం ఆప్షన్ కాదు, ఆవశ్యకం అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మనం ఎంత ధనవంతులైనా, ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథానే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా.. లేదా మరేదైన ఫిజికల్ యాక్టివిటీ (Physical Activity)ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.
Damodar Rajanarsimha | గచ్చిబౌలి స్టేడియంలో..
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)తో కలిసి రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం యోగా చేశారు. మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం అన్నారు. యోగాతో శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న లైఫ్‌స్టైల్, తీసుకుంటున్న ఆహారం, పొల్యూషన్ కారణంగా షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Damodar Rajanarsimha | మానసిక ప్రశాంతత
యోగా సాధన (Yoga Practice)తో శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుందని మంత్రి తెలిపారు. అంతేగాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కల్తీ, నాసిరకం ఆహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 145 పాలీక్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.యోగా, నేచరోపతి, హోమియోపతి వంటి ఆయుష్ విధానాలను బలోపేతం చేస్తున్నట్లు రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 750 మంది యోగా శిక్షకులను నియమించి రోజువారీ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా విద్యను ప్రోత్సహించేందుకు BNYS కోర్సుతో పాటు పీజీ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ
