అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR Political Strategy | మాజీ మంత్రి, కాంగ్రెస్‌లో 4 దశాబ్దాలు సేవలు అందించిన జీవన్‌రెడ్డి త్వరలో బీఆర్ఎస్లో చేరనున్నారు.
జగిత్యాలకు చెందిన జీవన్‌రెడ్డి పదేళ్ల బీఆర్ఎస్ (BRS) హయాంలో సైతం కాంగ్రెస్‌ను వీడకుండా.. పార్టీ కోసం పని చేశారు. తాజాగా అలాంటి నేత తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) అంశంలో బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్వయంగా జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఆయనను లంచ్‌కు రావాలని కేటీఆర్ ఆహ్వానం పంపారు. శుక్రవారం మధ్యాహ్నం మాజీ సీఎం జగిత్యాల నేతతో సమావేశం కానున్నారు. జీవన్‌రెడ్డి చేరిక విషయంలో బీఆర్ఎస్ వేస్తున్న అడుగులు కీలకంగా మారాయి. ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేగాకుండా ఆయన చేరిక ద్వారా కాంగ్రెస్‌లో అసంతృప్తులకు సైతం గాలం వేయాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ స్వయంగా చొరవ చూపుతున్నారని తెలిసింది.
KCR Political Strategy | సీనియర్ల గుర్రు
కాంగ్రెస్‌లో పలువురు సీనియర్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలనపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల రాజ్యసభ ఎంపీ సీటు విషయంలో కూడా సీనియర్లను కాదని సీఎం తన సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డికి కేటాయించారు. దీనిపై పలువురు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరిత మంచి అవకాశం ఇస్తామని చెప్పడానికే జీవన్ రెడ్డి విషయంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
KCR Political Strategy | గతంలో రేవంత్‌రెడ్డి సైతం..
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ (KCR) పక్కన పెట్టిన నేతలను రేవంత్‌రెడ్డి ఏకం చేశారు. వాళ్లతో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలను కలుపుకొని వెళ్లి అధికారం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ సైతం ఇదే ఫార్మూలా అప్లై చేయాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఆ పార్టీలోని సీనియర్లు తమ వైపు వస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్ట్‌లు.. 190 మందికి పాజిటివ్
