అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jeevan Reddy joins BRS | మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ (BRS)లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20న ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సమక్షంలో జీవన్‌రెడ్డి పార్టీలో చేరతారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో చేరిక కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై ఈ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు వచ్చారని చెప్పారు. ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
Jeevan Reddy joins BRS | కాంగ్రెస్ పట్టు కోల్పోయింది
జీవన్‌రెడ్డి శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ఉందని విమర్శించారు. ఒకప్పుడు PCC చెప్పినట్టు సీఎం నడుచుకునేవారని, నేడు సీఎం చెబితే PCC అమలు చేస్తోందని ఆరోపించారు. PCC తప్పు చేసి నింద AICCపై వేస్తోందన్నారు.
Jeevan Reddy joins BRS | కేసీఆర్ రావాలి
రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పోయి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. పదవుల కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలంటే తాను బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజే వెళ్ళేవాడినని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందన్నారు.
ఇది కూడా చదవండి : She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
