అక్షరటుడే, కామారెడ్డి: Tiger Movement Kamareddy | కామారెడ్డి జిల్లాలో పెద్దపులి మరోసారి సంచరించడం కలకలం రేపుతోంది. మాచారెడ్డి (Machareddy) రేంజ్ పరిధిలోని రెడ్డిపేట స్కూల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో గత ఆరు నెలల క్రితం పెద్దపులి సంచరించింది. ఆ తర్వాత అటవీ ప్రాంతం గుండా నిజామాబాద్ వైపు వెళ్లి ఉంటుందని (Forest Department Kamareddy) అధికారులు అనుమానించారు.
Tiger Movement Kamareddy | దోమకొండ మండలంలో..
గత రెండు నెలలక్రితం దోమకొండ (Domakonda) మండలంలో మరోసారి పెద్దపులి సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మరోసారి మాచారెడ్డి రేంజ్ పరిధిలోని ఎల్లంపేట బీట్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాంతో అటవీ ప్రాంతంలో అధికారులు పులి జాడ కోసం ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పులి పాదముద్రలు సైతం ఫారెస్ట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ట్రాక్ కెమెరాల్లో సైతం పెద్దపులి సంచరిస్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. పెద్దపులి సంచారంతో అటవీ ప్రాంత సమీప గ్రామస్థులను ఫారెస్ట్ అధికారులు అలర్ట్ చేశారు. పులి సంచారంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Tiger Movement Kamareddy | ఆర్నెళ్ల క్రితం గోదావరి దాటి..
గత ఆర్నెళ్లక్రితం గోదావరి నది దాటి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోకి ప్రవేశించి అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల (Sirisilla) జిల్లా మీదుగా సిద్దిపేట (Siddipet) వైపు వెళ్లి తిరిగి కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని మాచారెడ్డి రేంజ్ పరిధిలోకి పెద్దపులి ప్రవేశించడంతో మాచారెడ్డి రేంజ్ అటవీ ప్రాంతం పెద్దపులికి అనువుగా ఉన్నట్లుగా ఫారెస్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సంతానోత్పత్తి కోసం పులి వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా పులి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవి కాలం కావడంతో అటవీప్రాంతంలో నీరు లేక పెద్దపులి నీటి కోసం బయటకు రావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CBG Project | తెలంగాణ బయో – ఇంధన రంగంలో నవశకం.. సిద్దిపేటలో రూ. 700 కోట్లతో భారీ CBG ప్రాజెక్టు ప్రారంభం
