అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bumrah Wicketless Streak | క్రికెట్ ప్రపంచంలో యార్కర్ కింగ్‌గా పేరు గాంచిన జస్రీత్ బుమ్రా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. బ్యాటర్లను తన యార్కర్లతో ఇబ్బంది పెట్టే బుమ్రా, ఈసారి మాత్రం ఐపీఎల్ 2026 (IPL 2026)లో వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత ఐదు మ్యాచ్‌లుగా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాజాగా ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరు బ్యాటర్లు భారీగా విరుచుకుపడి 240 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి, జట్టులో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, వికెట్ మాత్రం దక్కలేదు.
Bumrah Wicketless Streak | ఫామ్ కోల్పోయిన బుమ్రా..
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా వికెట్ తీసుకోలేకపోయాడు.అంతేకాకుండా ఐపీఎల్ 2025 చివర్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ నుంచే ఆయన ఫామ్ తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి వికెట్ దక్కించుకోలేకపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 19 ఓవర్లు (114 బంతులు) వేసి 163 పరుగులు ఇచ్చినా, ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ఆయన ఎకానమీ రేటు 8.5గా ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు అతను వికెట్లు తీయలేకపోవడంతో జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది.
Bumrah Wicketless Streak | భారత జట్టుకు కూడా కీలక బౌలర్
సాధారణంగా బుమ్రా బౌలింగ్‌కి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతుంటారు. దీంతో ఇతర బౌలర్లకు వికెట్లు దక్కేవి. కానీ ప్రస్తుత పరిస్థితిలో బుమ్రా మీద భయం తగ్గిపోవడం ప్రత్యర్థి జట్లకు అనుకూలంగా మారింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యువ ఆటగాళ్లు కూడా బుమ్రాపై ధైర్యంగా ఆడుతున్నారు. కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కూడా బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం ఆయన ప్రస్తుత ఫామ్‌ను సూచిస్తోంది. బుమ్రా కేవలం ముంబై ఇండియన్స్‌కే కాదు, భారత జట్టుకు కూడా కీలక బౌలర్. ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండటంతో ఆయన ఫామ్‌పై ఆందోళన మరింత పెరిగింది. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా తన పాత రిథమ్‌ను తిరిగి అందుకుని, తన ప్రత్యేక యార్కర్లతో వికెట్లు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు బుమ్రాపైనే ఉంది. ఆయన తిరిగి తన ఫామ్‌లోకి వస్తాడా? మళ్లీ ప్రత్యర్థులను భయపెట్టే యార్కర్ కింగ్‌గా నిలుస్తాడా? అన్నది చూడాలి.
ఇది కూడా చదవండి..: IPL 2026 Gloves Issue | చెన్నై తొలి విజయం.. హాట్ టాపిక్‌గా మారిన స్టబ్స్ గ్లోవ్స్ వివాదం
