అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్ అనేది అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కంపెనీ. ఇది క్లాడ్ అనే శక్తిమంతమైన ఏఐ మోడల్‌ను తయారు చేస్తోంది. ఈ కంపెనీని ఓపెన్ ఏఐ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ కంపెనీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో దాని కొత్త ఏఐ టూల్స్, ప్లగ్-ఇన్స్, మోడల్ అప్‌డేట్స్ భారీ సంచలనం సృష్టించాయి.
ఆంత్రోపిక్ (Anthropic) ఇటీవల అనేక ఏఐ ప్లగిన్‌లను ప్రారంభించింది. ఈ ఏఐ టూల్స్ సాఫ్ట్‌వేర్, లీగల్ టెక్, ఆర్థిక సేవలలోని స్టాక్‌లపై అత్యధిక ప్రభావాన్ని చూపాయి. ఏఐ ప్రపంచంలో ఆంత్రోపిక్ క్లాడ్ చాట్‌బాట్ ప్రసిద్ధి చెందింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ని ప్రకటించింది. ఈ క్లాడ్‌కోడ్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేస్తుంది. అందులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు పరిష్కారాలను సిఫార్సు చేస్తుంది. దాంతో కోడింగ్ ప్రాసెస్‌లోనే డెవలపర్లు భద్రతాపరమైన లోపాలను గుర్తించి, పరిష్కరించుకోవడానికి వీలు చిక్కుతుంది. అయితే ఈ ఏఐ ఆధారిత ఫీచర్ ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది.
Anthropic Trump Dispute | యూఎస్ రక్షణ శాఖతో విభేదాలు..
ఆంథ్రోపిక్ స్టార్టప్ కొత్త ఫీచర్లలో మిలిటరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. మిలిటరీ క్లాసిఫైడ్ సిస్టమ్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మోడల్ ఇది. దీనిని సున్నితమైన నిఘా, రక్షణ కోసం ఉపయోగించవచ్చు. ఈ నేపథ్యంలో చట్టబద్ధమైన ఉపయోగాల కోసం ఏఐ మోడళ్లను ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలని, యుద్ధాలు, గూఢచర్యానికి సంబంధించి ఏఐకి ఉన్న ‘సేఫ్టీ రూల్స్’ను తొలగించాలని ఆంథ్రోపిక్‌ను యూఎస్ రక్షణశాఖ (US Defense Department) కోరింది. అయితే వీటిని ఆంథ్రోపిక్ అంగీకరించలేదు. ఏఐ టూల్ క్లాడ్‌ను అమెరికన్లపై గూఢచర్యానికి, ప్రాణాంతక సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగించకూడదని పేర్కొంది.
Anthropic Trump Dispute | ప్రత్యర్థి సంస్థ ఓపెన్ ఏఐతో పెంటగాన్
యూఎస్ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భద్రతా చర్యలను విస్మరించే అవకాశం ఇవ్వబోమని కంపెనీ స్పష్టం చేసింది. అయితే అమెరికా రక్షణశాఖ డిమాండ్లకు నో చెప్పిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్‌తో వ్యాపారం చేయబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఆ టెక్నాలజీని వాడడం వెంటనే ఆపేయాలని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. ఇదే సమయంలో ఆంథ్రోపిక్ ప్రత్యర్థి సంస్థ ఓపెన్ ఏఐతో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ వెల్లడించారు. “అమెరికా రక్షణ శాఖతో నిన్న ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించడంపై మా మధ్య చర్చ జరిగింది. ఇరువర్గాలు అంగీకారానికి వచ్చిన పరిమితుల్లోనే ఏఐ మోడల్స్ పనిచేస్తాయని నిర్ధారించేందుకు సాంకేతికపరమైన విధానాలను ప్రవేశపెట్టనున్నాం” అని ఆల్టమన్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. రేపటి నుంచి ట్రంప్ టారిఫ్‌లు నిలిపివేత

