అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20 World Cup 2026 | ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు టీ20 ప్రపంచకప్ 2026పై ప్రభావం చూపుతున్నాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతతో ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడగా, ఆటగాళ్ల భద్రతపై ఐసీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
భారత్ (Bharat), శ్రీలంక (Srilanka) వేదికలుగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) కు మధ్యప్రాచ్య యుద్ధ సెగ తగిలింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. టెహ్రాన్ నుంచి ప్రతీకార దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ దేశాల గగనతలంలో విమాన ప్రయాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ పరిణామాలను International Cricket Council (ఐసీసీ) నిశితంగా గమనిస్తోంది. టోర్నీలో పాల్గొంటున్న జట్లు, మ్యాచ్ అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు చేపట్టింది.
T20 World Cup 2026 | దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతతో..
ప్రపంచకప్‌లో పాల్గొన్న జట్లు, బ్రాడ్‌కాస్టర్లు, మ్యాచ్ అఫిషియల్స్ తమ దేశాలకు తిరుగు ప్రయాణంలో సాధారణంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని ప్రధాన ట్రాన్సిట్ హబ్‌గా ఉపయోగిస్తుంటారు. అయితే తాజా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ విమానాశ్రయం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీంతో భారత్ (India) నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యేక సూచనలు జారీ చేసి, గగనతల మార్పులు , భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
T20 World Cup 2026 | భద్రతకు ప్రాధాన్యం
ఈ పరిస్థితులపై స్పందించిన ఐసీసీ ప్రతినిధి, “టోర్నీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భద్రతే మా మొదటి ప్రాధాన్యం. మా ట్రావెల్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆటగాళ్లు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు యూరప్, దక్షిణాసియా, ఆగ్నేయాసియా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నాం” అని తెలిపారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లపై (Events) కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. పరిస్థితులు ఎలా మారుతాయో అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

