అక్షరటుడే, వెబ్‌డెస్క్: Musi River Buildings | హైడ్రా తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలు కడుతుంటే హైడ్రాకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మూసీ నది ప్రాంతంలో నిర్మిస్తున్న భవనాల వద్ద ఆందోళన చేపట్టారు.
Musi River Buildings | పేదల ఇళ్లను కూల్చారు..
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుత్బుల్లాపూర్‌లో పేదల ఇళ్లను, ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేసిందని మండిపడ్డారు. మూసీలో కూడా ఎంతో మంది పేదవాళ్ల ఇళ్లను కూల్చిన హైడ్రా, ప్రభుత్వానికి మాత్రం.. ఇదే నదిలో కడుతున్న భారీ బిల్డింగ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్నానని చెప్పారని.. ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకు మేమంతా ఇక్కడే ఉంటామని వ్యాఖ్యానించారు. జనం బాటలో భాగంగా చెరువులు, నదులు ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్‌ల గురించి ఫిర్యాదులు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Musi River Buildings | అందరికీ ఒకే న్యాయం ఉండాలి..
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని కవిత మండిపడ్డారు. ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారని.. దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్ మెంట్ వాళ్లను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. కానీ ఇప్పుడిప్పుడే కడుతున్న ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ఎందుకు ఆపడం లేదని నిలదీశారు. మాకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదని.. ప్రభుత్వంతోనేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్‌ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు నిర్మాణాలను ఆపారన్నారు. కానీ ఆ తర్వాత ఆమ్యామ్యాలు తీసుకొని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటమని స్పష్టం చేశారు. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Census 2026 | మే 11 నుంచి జనగణన.. కలెక్టర్లకు సీఎస్ సూచనలు

