అక్షరటుడే, వెబ్‌డెస్క్ : West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్ (Iran) ప్రతీకార దాడుల పేరిట భారీగా డ్రోన్లు, క్షిపణులను గల్ఫ్ దేశాలపై ప్రయోగిస్తోంది. అయితే ఆయా దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉండటంతో దేశంలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిత్యం గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడుతున్నారు.
ప్రధాని మోదీ మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ (Sultan of Oman Haitham bin Tariq), కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలేద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబా, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీలతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లోని భారత కమ్యూనిటీ భద్రతపై చర్చించారు. అరబ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారు. 48 గంటల్లో 8 దేశాల పాలకులతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు.
West Asia Tensions | దాడులపై ఆందోళన
ఆయా దేశాలపై దాడుల విషయంలో ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్లో వారితో మాట్లాడిన మోదీ వారి దేశాలలో నివసిస్తున్న భారతీయ సమాజ సంక్షేమం, భద్రత గురించి కూడా చర్చించారు. రెండు రోజులుగా మోదీ బహ్రెయిన్ (Bahrain) రాజు, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్‌తో మాట్లాడారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II తో కూడా సంభాషించారు. ఈ ప్రాంతంలో మారుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్, పశ్చిమ ఆసియాలో నివసిస్తున్నారు. ఇరాన్‌లో దాదాపు 10 వేల భారతీయ పౌరులు, విద్యార్థులు ఉన్నారు. ఇజ్రాయెల్‌లో 40 వేలకు పైగా నివసిస్తున్నారు.
West Asia Tensions | బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్‌పై దాడులు
బహ్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. మూడు చోట్ల భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం సైరన్ మోగించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. హై రైజ్డ్ బిల్డింగ్స్.. భవనాలు ఖాళీ చేసి సెల్లార్‌లోకి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బహ్రెయిన్‌కు అంతర్జాతీయ కమ్యూనికేషన్ కట్ అయ్యేలా ఇరాన్ దాడులు చేస్తోంది.

దీనిని కూడా చదవండి : Indians Killed in Iran Attacks | ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

