అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Sushmitha | ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న కొండా కుటుంబం మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. పరకాల నుంచి తాను పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా అంతర్గత విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. కొండా కుటుంబానికి, ఇతర ఎమ్మెల్యేలు, నేతలకు మధ్య పొసగడం లేదు. కొండా మురళి గతంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. అనంతరం తన కూతరు పరకాల నుంచి పోటీ చేస్తుందని కొండా సురేఖ సైతం పేర్కొన్నారు. ఈ గొడవ పలుమార్లు క్రమ శిక్షణ కమిటీ వద్దకు కూడా వెళ్లింది. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమన్వయంతో పని చేయాలని నేతలకు కమిటీ సూచించింది. ఇటీవల ఎన్నికలు ముగియగా.. తాజాగా కొండా సుష్మిత తాను ఎమ్మెల్యే అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Konda Sushmitha | ఎన్నికల్లో పోటీ చేస్తా
తాను తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సుష్మిత పటేల్ అన్నారు. పరకాల (Parakal) నుంచి పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. కాగా అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న స్థానంలో తాను పోటీ చేస్తానని సుష్మిత పటేల్ చెప్పడం గమనార్హం. దీంతో మరోసారి వరంగల్ కాంగ్రెస్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Konda Sushmitha | ఇక్కడి నుంచే..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు కొండా సుష్మిత తన తండ్రి మురళితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల ప్రస్థానం కొమ్మాల జాతర నుంచి ప్రారంభం అయిందన్నారు. తన రాజకీయ ప్రస్థానం సైతం ఇక్కడి నుంచే మొదలు అవుతుందని చెప్పారు. తన తండ్రి మురళి ఇప్పటికే ముగ్గురు, నలుగురి గుండెల్లో నిద్ర పొతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నా కూతురికి ధైర్యం ఎక్కువ
కొండా మురళి (Konda Murali) మాట్లాడుతూ.. తన కూతురికి ధైర్యం ఎక్కువ అన్నారు. పరకాల తమ అడ్డా అని, వచ్చే ఎన్నికల తన బిడ్డ పోటీ చేస్తుందని చెప్పారు. సుష్మితకు ధైర్యం ఎక్కువ అని, ఎవరినైనా ఎదిరిస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలకు సమస్య వస్తే ఎవర్నీ వదలిపెట్టదని తెలిపారు. పరకాల నియోజకవర్గానికి అండగా ఉంటుందని చెప్పారు. కొండా మురళి, సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.


