అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం నెలకొంటుందని జలమండలి (HMWSSB) అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరా నిలిపి వేస్తామన్నారు.
నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా (Manjeera) ఫేజ్-3లో గల పెద్దాపూర్ పంప్ హౌస్‌లో 35 ఏళ్లుగా వినియోగిస్తున్న హెచ్‌టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించనున్నారు. వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Hyderabad Water Supply | పైప్‌లైన్‌కు మరమ్మతులు
జలమండలి అధికారులు పైప్‌లైన్ మరమ్మతులు సైతం చేపట్టనున్నారు. పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మి.మీ. డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను, సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మి.మీ. డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్వెంట్స్ను మార్పిడి చేయనున్నారు. ఈ పనులు మార్చి 7 ఉదయం 8 గంటల నుంచి 8వ తేది రాత్రి 8 గంటల వరకు సాగుతాయి. దీంతో 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్‌తో వాటర్ వస్తాయని అధికారులు తెలిపారు.
Hyderabad Water Supply | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
షేక్‌పేట్ రిజర్వాయర్ (Shakepet Reservoir)కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తారు. భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెజర్‌తో సరఫరా ఉంటుంది. కోకాపేట్, మణికొండ, నార్సింగి, మంచిరేవుల ట్రాన్స్‌మిషన్ I & II ప్రాంతాలకు పూర్తిగా నీటి సరఫరా నిలిపి వేస్తారు. వినియోగదారులు పొదుపుగా నీటిని వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.


