అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllareddy Science Fair | విద్యార్థులు తమ మేధస్సుకు పదను పెట్టి అద్భుతమైన ప్రదర్శనలు చేశారని,.. భవిష్యత్తులో భావి శాస్త్రజ్ఞులుగా విద్యార్థులు ఎదుగాలని సీఐ రాజిరెడ్డి, ఎంఈఓ రాజులు ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని జీవధాన్ పాఠశాలలో రెండు రోజులపాటు సైన్స్ ఫేర్ ను నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీవీ రామన్, అబ్దుల్ కలాం గురించి విద్యార్థులకు వివరించారు. సైన్స్ నిత్య జీవితంలో ఒక భాగమన్నారు. సైన్స్ లేనిదే ఏదీ లేదని, ప్రతి ఒక్కటి సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. విద్యార్థి దశలోనే సైన్స్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు.
YEllareddy Science Fair | మిస్సైల్ మ్యాన్
అబ్దుల్ కలాం లాంటి మిస్సైల్ మ్యాన్‌ను ఆదర్శంగా తీసుకొని సైన్స్ లో రాణించాలన్నారు. పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు 200కు పైగా ప్రదర్శనలు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.
సమాజంలోని సమస్యలకు మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సైన్స్ ఫెయిర్ ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించ గలుగుతున్నామని అన్నారు.
YEllareddy Science Fair | ప్రత్యేక ప్రదర్శనలు
సైన్స్ ఫెయిర్‌లో భాగంగా విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే పురాతన వస్తువుల వినియోగం, బొమ్మల కొలువు, అల్లికలు, అంతరిక్షం, 3d ప్లే, హైడ్రాలిక్ మిషన్స్, పీఎస్ఎల్వీసీ 33, 37 నమూనాలు, నానోట్యూబ్ నమూనా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్ కంట్రోల్డ్ బైరిమోట్, ఫుడ్ కోర్టు, స్పేసూమ్ , ఆయుర్వేదం మొక్కలు, సంప్రదాయ వస్తువులు, ప్లానిటోరియం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రదర్శనలో విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలలోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్ర, జీవశాస్త్రాలలోని విషయాల అనువర్తనాలు సులువుగా అర్థం అయ్యేలా తమ ప్రయోగాలతో వివరించారు. ఈ సైన్స్ ఫెయిర్ ను తిలకించేందుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాబు, జోబీస్, బెల్లంపల్లి ఫాదర్ శిబూ, కామారెడ్డి, బోధన్ పాఠశాల ఉపాధ్యాయులు, ఎల్లారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్, సతీష్ ,నిర్మల, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

