అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy Sisters Murder | మహిళల సాధికారత, సమానత్వం, హక్కుల కోసం మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ విజయాలను గుర్తుచేసుకుంటూ… అతివలకు సమాజంలో ఎదురయ్యే అన్యాయాలపై ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ప్రత్యేక రోజు ఇది.
కానీ, ఈ ప్రత్యేక దినోత్సవానికి ఒకరోజు ముందు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన సమాజాన్ని కలచివేసింది. కామారెడ్డి పట్టణం ఆర్బినగర్ కాలనీలో నివసించే ముగ్గురు చిన్నారులు.. సిపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) అనుమానాస్పదంగా అదృశ్యమై అనంతరం చెరువులో మృతదేహాలుగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడినట్లు తేలడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
Kamareddy Sisters Murder | తినుబండారాల కోసం వెళ్లి తిరిగి రాని పసిమొగ్గలు
శనివారం ఉదయం పిల్లలు తమ తండ్రితో కలిసి తినుబండారాలు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లారు. అయితే కొంతసేపటికి వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కామారెడ్డి పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లి విలపించిన దృశ్యాలు అక్కడి ప్రజల హృదయాలను కలిచివేశాయి.
Kamareddy Sisters Murder : తండ్రే కాలయముడైతే…
తండ్రి అంటే పిల్లలకు రక్షణ.. భద్రత.. ప్రేమ.. కానీ అదే తండ్రి కాలయముడిగా మారితే?.. ఆ చిన్నారుల మనసులో చివరి క్షణాల్లో ఎంత భయం, ఎంత బాధ, ఎంత నిరాశ నిండివుండి ఉంటుందో ఊహించుకోవడమే గుండెల్ని పిండేస్తుంది. ఇంకా జీవితాన్ని చూడని పసిమొగ్గల జీవితం అర్ధంతరంగా ముగిసింది. నిండుగా నూరేళ్లు బ్రతకాల్సిన మూడు చిన్న జీవితాలు… కొన్ని నిమిషాల్లోనే చీకటిలో కలిసిపోయాయి.
Kamareddy Sisters Murder : అన్యాయాల ప్రతిబింబం
మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పే రోజు మాత్రమే కాదు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, హింస, వివక్షను గుర్తించి సమాజం ఆలోచించాల్సిన రోజు. ప్రపంచవ్యాప్తంగా మూడు మహిళల్లో ఒకరు జీవితంలో ఏదో ఒక దశలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
భారతదేశంలో కూడా పరిస్థితి పూర్తిగా మారలేదనే వాస్తవం ఇలాంటి సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. బాలికలపై హింస, లైంగిక దోపిడీ, కుటుంబ హింస, బాల్య వివాహాలు వంటి సమస్యలు ఇంకా సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
మహిళా దినోత్సవం చెప్పే సందేశం
ఈ సంవత్సరం మహిళా దినోత్సవం “Rights. Justice. Action. For ALL Women and Girls” అనే భావనను ముందుకు తెస్తోంది. అంటే మహిళల హక్కులు కేవలం చట్టాల్లోనే కాకుండా జీవితంలో కూడా నిజంగా అమలు కావాలి అన్నది దీని సందేశం. కానీ, కామారెడ్డి ఘటన మనకు ఒక చేదు నిజాన్ని గుర్తుచేస్తోంది. మహిళల భద్రత కోసం పోరాటం ఇంకా పూర్తికాలేదని చెబుతోంది.
ఇది కూడా చదవండి: Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!

