అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Velugumatla Indiramma Houses | ఖమ్మం (Khammam) జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. అర్హులైన 311 మంది పేదలకు స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇంటి స్థలం ఉన్న 101 మందికి ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఖమ్మం కలెక్టరేట్ (Khammam Collectorate)లో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉంటున్న వారి ఇళ్లను ఇటీవల ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. దాదాపు 700 కుటుంబాలను ఇళ్లు, గుడిసెలను అధికారులు తొలగించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తాజాగా నిర్వాసితులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించారు.
Velugumatla Indiramma Houses | అనేక ఇబ్బందులు
భూధాన్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలు కనీస అవసరాలు లేక అనేక ఇబ్బందులను పడ్డారని మంత్రి పొంగులేటి అన్నారు. అక్కడ కొందరు వ్యక్తులు ఒక ముఠాలా తయారై పట్టాలు ఇప్పిస్తామని పేదలను నమ్మించి మోసం చేశారన్నారు. బ్రోకర్ల మాటలు నమ్మిన ప్రజలు వారికి అధిక మొత్తంలో డబ్బులను ముట్టజెప్పారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న భూధాన్ భూములను సీసీఎల్, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. పేదల కష్టం తెలిసిన ప్రజాప్రభుత్వం అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయడానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు.

Velugumatla Indiramma Houses | పట్టించుకోని బీఆర్ఎస్
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) వెలుగుమట్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదని మంత్రులు అన్నారు. ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తాం అనే ప్రధాన ప్రతిపక్ష నాయకులు పగటి కలలు మానుకోవాలని ఎద్దేవా చేశారు. వెలుగుమట్లలో ఇండ్ల నిర్మాణం పూర్తవ్వడానికి ముందే అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దీనిని కూడా చదవండి : Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత

