అక్షరటుడే, న్యూఢిల్లీ: Joint Tax Filing : దేశంలో దంపతులపై పడుతున్న ఆదాయపు పన్ను భారం తగ్గించేందుకు జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వ్యవస్థను తీసుకురావాలని రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా Raghav Chadha కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను విధానం వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ ఆదాయం సంపాదించే కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా చద్దా మాట్లాడారు. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేసే కుటుంబాల్లో పన్ను లెక్కలు వేర్వేరుగా ఉండటంతో కొంత మేరకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
Joint Tax Filing : ఉదాహరణకు..
దంపతులు చెరో ₹10 లక్షలు సంపాదిస్తే వారి వ్యక్తిగత ఆదాయాలపై పన్ను భారం అంతగా ఉండకపోవచ్చు. కానీ, కుటుంబంలో ఒకరే ₹20 లక్షలు సంపాదిస్తే.. మాత్రం, ప్రస్తుతం ఉన్న పన్ను విధానం ప్రకారం సుమారు ₹1.92 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి వస్తోందని చద్దా వివరించారు. ఇది ఒకే కుటుంబ ఆదాయమే అయినప్పటికీ, పన్ను విధానంలో సమానత్వం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.
జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానం అమలు చేస్తే.. భార్యాభర్తల సంపాదనను ఒక కుటుంబ ఆదాయంగా పరిగణించి పన్ను లెక్కించవచ్చని చద్దా చెప్పుకొచ్చారు. ఈ విధానం అమలులోకి వస్తే ఒకరి ఆదాయం ఎక్కువ ఉన్నా.. మొత్తం కుటుంబ ఆదాయాన్ని లెక్కించడం వల్ల పన్ను భారం గణనీయంగా తగ్గుతుందని వెల్లడించారు.
Joint Tax Filing : అభివృద్ధి చెందిన దేశాల్లో..
కెనడా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వ్యవస్థ అమలులో ఉందని చద్దా గుర్తుచేశారు. ఆ దేశాల్లో దంపతులు సమష్టిగా ఆదాయపు పన్ను దాఖలు చేయడం వల్ల కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. భారత్‌లోనూ ఇదే విధానం అమలు చేస్తే మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
దంపతులలో ఒక్కరే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న పన్ను విధానం వల్ల ఆ కుటుంబంపై అధిక ఆర్థిక భారం పడుతోందన్నారు. జాయింట్ ఫైలింగ్ అమలుతో ఆ భారాన్ని తగ్గించడంతోపాటు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం కల్పించవచ్చన్నారు.

