అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Flood Control | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వరదల కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోందని హైడ్రా (Hydraa) కమిషనర్ రంగనాథ్ అన్నారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడంతో గతేడాది భారీ వర్షాలు పడినా ప్రజలకు ఇబ్బందులు తలెత్తలేదన్నారు.
నగరంలో చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే వరద కాలువల పునరుద్ధరణ చేపట్టామని వివరించారు. 24 చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, ఇందులో మూడు చెరువులను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వరదల ప్రభావం లేని నివాస ప్రాంతాల వృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్న వేళ.. చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించుకోవాలన్నారు. చెరువులు, కాలువల ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ అంటే నగర ప్రజలకు ప్రస్తుతం స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. దీంతో నిర్మాణ సంస్థలతో పాటు.. ఇల్లు కొనాలనుకునేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.
Hyderabad Flood Control | పెరుగుతున్న జనాభా
దేశంలోని నగరాల్లో జనాభా భారీగా పెరుగుతోందని హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) పేర్కొన్నారు. 1975లో హైదరాబాద్ జనాభా 2.1 మిలియన్ ఉంటే.. ప్రస్తుతం 13 మిలియన్లకు చేరిందన్నారు. కానీ సహజవనరులు మాత్రం తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1975 నుంచి 2024 మధ్య నగరంలో ఉన్న చెరువుల్లో 61 శాతం మాయం అయ్యాయని తెలిపారు. నగరంలో 30 వేల నాలాలు ఆక్రమణలకు గురైనట్టు గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సెంట్రల్ వాటర్ కమిషన్, కృష్ణ, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Fake Paneer Seizure | మార్కెట్లో కల్తీ పన్నీరు విక్రయం.. తిన్నారంటే అంతే!

