అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్ ను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన కతార్లోని ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రమైన రస్ లఫాన్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసింది. దీంతో గ్యాస్ కష్టాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.ఇది మార్కెట్ ను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడం, రూపాయి విలువ మరోసారి ఆల్ టైం కనిష్టానికి పడిపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు.
Stock Market Crash | ఇన్ఫ్లేషన్ భయాలు..
అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉండడంతో యూఎస్ ఫెడ్ తన మానిటరీ పాలసీ మీటింగ్లో వడ్డీరేట్ల తగ్గింపు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్ల పతనానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.
Stock Market Crash | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ మరియు స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని సంఘటనలు, పద్ధతులతో తాను ఏకీభవించడం లేదని, అందుకే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చక్రవర్తి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో షేర్ హోల్డర్లు నెగెటివ్ గా స్పందించడంతో స్టాక్ ప్రైస్ భారీగా పడిపోయింది. ప్రధాన సూచీల భారీ పతనానికి ఇది కూడా కారణం.
Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమైంది. 1,954 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ మరో 65 పాయింట్లు కోల్పోయింది. అక్కడి నుంచి కోలుకొని 665 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 580 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 17 పాయింట్లు కోల్పోయింది. అక్కడి నుంచి 198 పాయింట్లు పెరిగింది. ఉదయం 11:45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,756 పాయింట్ల నష్టంతో 74,947 వద్ద నిఫ్టీ 539 పాయింట్ల నష్టంతో 23,239 వద్ద కదలాడుతున్నాయి.
ఒకే ఒక్కటి..
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఒకే ఒక స్టాక్ లాభాల బాటలో సాగుతోంది. పవర్ గ్రిడ్ 0.3 శాతం లాభంతో ఉంది. ఎటర్నల్, ఎల్టీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో టాప్ లూజర్లుగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Trump Warns Iran | ఇరాన్‌కు డొనాల్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

