అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Heatwave 2026 | దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయి. ఈమేరకు పంచాంగ సూచనలు, వాతావరణ అంచనాలు ఒకే దిశగా సంకేతాలు ఇప్పటికే అందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు మొదలయ్యాయి. మార్చి నెలలో తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఈ వేసవి మరింత కఠినంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
India Heatwave 2026 | గతంలో ఎండ తీవ్రత ఇలా..
దేశంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి.
- 2022–23: పలు రాష్ట్రాల్లో 45°C దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- 2024: దేశ చరిత్రలో అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా 2024 ఏడాది నమోదైంది.
- 2025: ఫిబ్రవరిలోనే హీట్‌వేవ్ నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 125 ఏళ్లలోనే అత్యంత వేడి ఫిబ్రవరిగా నమోదు కావడం గమనార్హం.
- ఈ గణాంకాలు పరిశీలిస్తే.. ఏటా వేసవి తీవ్రత పెరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
India Heatwave 2026 | 2026లో పరిస్థితి..
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఇక మార్చి నెల భగభగ మంటోంది. పలు ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 4°C – 8°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే 42°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి నుంచి మే వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు ఉండనున్నట్లు IMD ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ మార్పుల ప్రభావం
నిపుణుల అంచనా ప్రకారం.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారత్‌లో శీతాకాలం తగ్గిపోతోంది.. వేసవి కాలం ముందుగానే ప్రారంభం అవుతోంది. లా నినా వంటి సహజ ప్రభావాలు ఉన్నా కూడా.. వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతల వల్ల మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే నీటి కొరత కొనసాగుతోంది. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఆరోగ్య సమస్యలు మిన్నంటాయి.

