అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Food Adulteration | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. యథేచ్ఛగా ఆహార పదార్థాలను కల్తీ చేసి విక్రయిస్తోంది. తమ లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కల్తీ దందాపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే షాపులపై దాడులు చేస్తున్న పోలీసులు తాజాగా ‘H-FAST’ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో ఏళ్లుగా కల్తీ దందా సాగుతోంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మొదలు పెడితే పిల్లలు తాగే పాల వరకు అన్నింటిని కల్తీ చేస్తున్నారు. పెరుగు, నెయ్యి, పన్నీరు ఇలా అన్ని కల్తీ చేస్తున్నారు. అలాగే పలు కంపెనీల ఉత్పత్తులను సైతం నకిలీవి తయారు చేస్తున్నారు. పేస్ట్‌లు, సబ్బులు, సర్ఫ్లు, షాంపులను కూడా వదలడం లేదు. నకిలీవి తయారు చేసి బ్రాండెడ్ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో భారీగా లాభాలు పొందుతున్నారు. అయితే కల్తీ పదార్థాలు తింటున్న ప్రజలు అనారోగ్యం బారీన పడుతున్నారు.
Hyderabad Food Adulteration | దాడులతో హడల్
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాలు (Adulterated Milk) తాగి పలువురు మృతి చెందారు. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. కల్తీ మాఫియాపై చర్యలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి గత 15 రోజులుగా నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. నగరంలో కల్తీ పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండటంతో నగర సీపీ సజ్జనార్ తాజాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Hyderabad Food Adulteration |హెచ్ – ఫాస్ట్ పేరిట
నగరవ్యాప్తంగా అసురక్షిత ఆహార పద్ధతులను అరికట్టేందుకు, పోలీసులు ‘H-FAST’ పేరుతో ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని ప్రారంభించారు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లతో కూడిన 28 మంది ఉంటారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ బృందంలోని సభ్యులు దాడులు చేస్తారు. నిఘా, కల్తీని గుర్తించడం, న్యాయపరమైన చర్యలపై ప్రధాన దృష్టి సారిస్తారు. ప్రజలు తమ సమీపంలో ఎక్కడైన కల్తీ ఆహార పదార్థాలను గుర్తిస్తే టోల్-ఫ్రీ నంబర్‌కు 8712661212 ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. హెచ్–ఫాస్ట్ ఆఫీస్‌ను ఐపీఎస్ అధికారి వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. ఆహార కల్తీని ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్‌జీ కి శనివారం నైట్ హబ్‌గా తాడ్‌బండ్ హనుమాన్ సన్నిధి!

